సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ భార్య శిల్ప‌..!

  • నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రినయని నటి పవిత్ర జయరాం మృతి
  • ఆరేళ్లుగా పవిత్ర జయరాంతో చంద్ర‌కాంత్ స‌హ‌జీవనం చేస్తున్నాడన్న భార్య శిల్ప‌
  • ఆమె మృతిని త‌ట్టుకోలేక మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్న‌ట్లు వెల్ల‌డి
  • ప‌విత్ర మాయ‌లో ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌న‌ను, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఐదేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆవేదన  
'త్రినయని' సీరియల్‌ నటుడు చంద్ర‌కాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. నాలుగు రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుంగిపోయిన చంద్ర‌కాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటకొచ్చింది. తాజాగా దీనిపై అత‌ని భార్య శిల్ప స్పందించింది. ఆరేళ్లుగా పవిత్ర జయరాంతో చంద్ర‌కాంత్ స‌హ‌జీవనం చేస్తున్నాడని వెల్లడించింది. త్రినయని సీరియల్‌ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచే వారిద్ద‌రి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న‌ట్లు ఆమె చెప్పుకొచ్చింది.

అయితే, త‌న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని శిల్ప తెలిపింది. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. కానీ పవిత్ర మాయలో పడిన చంద్ర‌కాంత్‌ గత ఐదేళ్లుగా తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రతో సంబంధం కారణంగా తనను, పిల్లల్ని పూర్తిగా వదిలేశాడని తెలిపింది. ఐదేళ్లుగా అస‌లు ఇంటికే రావడం లేదని, త‌మ‌తో మాట్లాడ‌టం కూడా మానేశాడ‌ని చెప్పింది. వివాహం త‌ర్వాత వివాహేత‌ర సంబంధాల కార‌ణంగా జీవితాలు నాశ‌నం అవుతున్నాయ‌ని, ఇప్పుడు త‌మ ప‌రిస్థితి కూడా అలాగే ఉంద‌ని వాపోయింది. 

ఈ క్ర‌మంలో పవిత్ర జ‌య‌రాం రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డంతో ఆయన డిప్రెష‌న్‌కు గురైన‌ట్లు పేర్కొంది. ఆమె ఆకస్మిక మరణం త‌ట్టుకోలేక‌ మూడు రోజుల క్రితం కత్తితో చేయి కోసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి కూడా యత్నించాడని శిల్ప‌ తెలిపింది. పవిత్ర.. నీ దగ్గరకు వస్తున్నానంటూ చంద్ర‌కాంత్ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సందేశం కూడా పెట్టినట్లు చెప్పింది. 

అలాగే చంద్ర‌కాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై తండ్రి వెంకటేశ్‌ కూడా స్పందించారు. పవిత్ర జ‌య‌రాంతో రిలేషన్ కార‌ణంగా త‌మ‌తో పాటు భార్యాపిల్లలను ప‌ట్టించుకోవ‌డం మానేశాడ‌ని ఆయ‌న తెలిపారు. ఐదేళ్లుగా తమ ఇంటికి కూడా రాలేదన్నారు. అయితే, మూడు రోజుల క్రితం తమ ఇంటికి వచ్చిన చంద్ర‌కాంత్‌.. పవిత్ర దగ్గరకు వెళ్లిపోతున్నా అని చెప్పాడని అన్నారు. నిన్న ఉదయం లక్డీకపూల్‌ వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదన్నారు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్‌కు పంపించామని చెప్పారు. అప్పుడే చంద్ర‌కాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందన్నారు.


More Telugu News