అన్నదమ్ములిద్దరూ పిట్టల్లా ఎగిరిపోయారు... వెంటనే అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య

  • ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం హింసాత్మక ఘటనలు
  • పల్నాడులో విధ్వంసం... ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై మండిపడుతున్న టీడీపీ 
  • పిన్నెల్లి బ్రదర్స్ సీఎంవో సూచనలతో పారిపోయారన్న వర్ల రామయ్య
  • పులివర్తి నానీపై హత్యాయత్నం వెనుక చెవిరెడ్డి, కొడుకు మోహిత్ రెడ్డి ఉన్నారని ఆరోపణ 
  • రాజంపేట డీఎస్పీ చైతన్యను తాడిపత్రి పంపించింది ఎవరంటూ ఫైర్
ఏపీలో ఇటీవలి పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాచర్ల రక్తచరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. 

పల్నాడు ఘటనలు జరగ్గానే ఇద్దరూ తాడేపల్లి సీఎంవోకు పారిపోయి వచ్చారని, సీఎంవో సూచనలు తీసుకున్న అనంతరం అక్కడ్నించి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్నా... ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకట్రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. 

"అయినా పెట్రోల్ బాంబులేంటండీ... కర్రలు, కత్తులు, బరిసెలు, ఇనుప రాడ్లు తీసుకుని పెరేడ్ చేయడం ఏంటండీ!... పోలీసులు వాళ్ల వెంట నడవడం ఏంటండీ? మనం సభ్యసమాజంలోనే ఉన్నామా? ఇది ప్రజాస్వామ్యమేనా? లేక, నియంతృత్వ పాలనలో ఉన్నామా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం, రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నాం అంటే మాత్రం ఆ అన్నదమ్ములు ఇద్దరినీ అరెస్ట్ చేయాలి. 

చంద్రగిరిలో మా నాయకుడు పులివర్తి నానీపై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నానికి ప్లాన్ చేసింది, పురిగొల్పింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతడికొడుకు మోహిత్ రెడ్డి కాదా? వీళ్లిద్దరినీ కూడా ఐపీసీ 307 కింద అరెస్ట్ చేయాలి. అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న నమ్మకం కుదురుతుంది. అక్కడ పిన్నెల్లి బ్రదర్స్, ఇక్కడ తండ్రీకొడుకులు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి. 

ఇక తాడిపత్రి విషయానికొస్తే... అనకూడదు కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక మనిషేనా? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను. అతడిని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని పోలీసులు అనడం ఏంటి? ఏమిటీ తమాషా పనులు... ఇంట్లోంచి పంపించడం కాదు, అతడ్ని అరెస్ట్ చేయాలి.

రాజంపేటలో పనిచేస్తున్న డీఎస్పీ చైతన్యకు తాడిపత్రిలో పనేంటి? ఎవరు అతడ్ని తాడిపత్రికి వెళ్లమని చెప్పారు? అతడు తాడిపత్రిలో మా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి, అంతా ధ్వంసం చేశాడు. ఇంట్లో కంప్యూటర్లు పగులగొట్టి, అక్కడ పనిచేస్తున్న ఓ దళిత దివ్యాంగుడ్ని కాలెత్తి తంతాడా? ఈ డీఎస్పీ మనిషా? పశువా? 

రాజంపేటలో పనిచేస్తున్న డీఎస్పీ తాడిపత్రి ఎందుకు వెళ్లాడు? పెద్దారెడ్డి పిలిస్తే వెళతాడా? ఒకవేళ ఎవరైనా అధికారి పంపిస్తే వెళ్లాడా? ఒకవేళ అదే నిజమైతే ఆ అధికారి ఎవరో కూడా తేలాలి. డీఎస్పీ చైతన్యను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అంటూ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News