ఫెడెక్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ నమ్మవద్దు... పోలీసులమని చెప్పగానే భయపడి డబ్బులు ఇవ్వొద్దు: వీసీ సజ్జనార్

  • అనుమానిత ఫోన్ కాల్‌గా కనిపిస్తే వెంటనే 1930కి ఫోన్ చేయాలన్న సజ్జనార్
  • సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఫెడెక్స్ పేరుతో మోసం చేస్తున్నారన్న సజ్జనార్
  • ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరాల బారిన పడుతున్నారని ఆందోళన
  • మీరు భయపడితే అవతలివారు మరింతగా భయపెడతారని సూచన
ఫెడెక్స్ పార్సిళ్ల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌‌ను అసలే నమ్మవద్దని... పోలీసులమని చెప్పగానే భయపడిపోయి డబ్బులు సమర్పించుకోవద్దని... సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఫోన్‌ కాల్స్‌పై అనుమానం వస్తే లేదా మోసాల బారినపడిన వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరాల బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఆయన 'ఈటీవీ' ముఖాముఖిలో సైబర్ నేరాలపై స్పందించారు.

సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు కొత్త కొత్త వాటిని ఎంచుకుంటున్నారన్నారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, రెంట్... ఇలా వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు ఫెడెక్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు. 'మేం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం... మీరు పార్సిల్ పంపించారు... అందులో డ్రగ్స్ ఉన్నాయి' అంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారన్నారు. కానీ మీరు పార్సిలే పంపించనప్పుడు భయపడటం ఎందుకు? అన్నారు. విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారన్నారు. మీరు భయపడితే అవతలివారు మరింతగా భయపెడతారని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే లక్షలు వస్తాయంటే ఆశపడి పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు. స్టడీ చేసిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలన్నారు.


More Telugu News