ముంబైకి రోహిత్ శ‌ర్మ‌ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?.. భార‌త మాజీ క్రికెట‌ర్ పోస్ట్ వైర‌ల్‌!

  • హిట్‌మ్యాన్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ స్పెష‌ల్ పోస్ట్‌
  • ఎంఐ జెర్సీలో రోహిత్‌ను చూడ‌డం బ‌హుశా ఇదే ఆఖ‌రిసారి అనే ఫీలింగ్ క‌లుగుతుంద‌న్న జాఫ‌ర్‌
  • వ‌సీం భాయ్ మీరు చెప్పేది నిజ‌మే కావొచ్చు అంటూ ఎమోష‌న‌ల్ అవుతున్న నెటిజ‌న్లు
ముంబై ఇండియ‌న్స్‌ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆ జట్టుకు లాస్ట్ మ్యాచ్ ఆడేశాడా? ఐపీఎల్లో రోహిత్ మళ్లీ ముంబయి జెర్సీలో కనిపించడా? అంటే సామాజిక మాధ్య‌మాల‌లో నెటిజన్లు ఔననే అంటున్నారు. ఇటీవల కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో మ్యాచ్ సందర్భంగా రోహిత్ మాటలే ఈ వార్తలకు బలం చేకుర్చుతున్నాయి. దీంతో ముంబై తరఫున రోహిత్ కు ల‌క్నో మ్యాచ్ ఆఖరిద‌ని, వచ్చే సీజన్లో ఆ జట్టులో ఉండడన్న ప్రచారం జ‌రుగుతోంది. 

కేకేఆర్ పోస్ట్ చేసిన వీడియోలో హిట్‌మ్యాన్ ఏమ‌న్నాడంటే..!

"నాదేముంది భాయ్ ఇదే చివరిది. ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అదంతా వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను వాటన్నింటినీ పట్టించుకోను. ఏదేమైనప్పటికీ అది నా ఇల్లు భాయ్‌. ఆ దేవాలయాన్ని నేను నిర్మించాను" అని రోహిత్ కేకేఆర్ కోచ్ అభిషేక్‌ నాయర్ తో అన్న మాటలు ఇటీవల వైరల్ అయ్యాయి. కోల్‌క‌తా ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో వెంటనే కేకేఆర్ అదే రోజు ఈ పోస్ట్ ను తొల‌గించింది.

ఇక ముంబై ఇండియ‌న్స్ ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా నిలిచిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తో ఎంఐ త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా భార‌త మాజీ క్రికెట‌ర్ వసీం జాఫ‌ర్.. రోహిత్ శ‌ర్మ‌పై ఓ ట్వీట్ చేశాడు. "ముంబై ఇండియ‌న్స్ జెర్సీలో రోహిత్ శ‌ర్మ‌ను చూడ‌డం బ‌హుశా ఇదే ఆఖ‌రిసారి అనే ఫీలింగ్ క‌లుగుతుంది" అని జాఫర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ముంబై త‌ర‌ఫున రంజీల్లో 1996 నుంచి 2015 వ‌ర‌కు వ‌సీం జాఫ‌ర్ ఆడాడు. ఇక ముంబైకే ఆడిన‌ రోహిత్‌తో అత‌నికి మంచి సంబంధాలు ఉన్నాయి. హిట్‌మ్యాన్ ఎదుగుద‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి చూసిన వ‌సీం ఇలా పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అవుతున్నారు. వ‌సీం భాయ్ మీరు చెప్పేది నిజ‌మే కావొచ్చు అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 

ఇక ల‌క్నోతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు 'రోహిత్.. రోహిత్' నినాదాలతో వాంఖ‌డే స్టేడియం మార్మోగిపోయింది. రోహిత్ సైతం ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ (38 బంతుల్లో 68 పరుగులు) తో అదరగొట్టాడు. అతడికి ముంబై తరఫున ఇదే లాస్ట్ మ్యాచ్ అని భావించిన ఆడియెన్స్ రోహిత్ ఔటైన తర్వాత నిలబడి చప్పట్లతో గ్రాండ్ గా సెండాఫ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News