‘నీకు మొక్కుతా.. నా ఆడియో ఆపెయ్’ కెమెరా మ్యాన్ తో రోహిత్ శర్మ సరదా సంభాషణ వైరల్

  • ఇప్పటికే ఓ ఆడియో తనకు చుక్కలు చూపించిందని కామెంట్
  • ధావల్ కులకర్ణితో రోహిత్ సంభాషణను చిత్రీకరించిన కెమెరా మ్యాన్
  • అందులోని తన ఆడియోను మ్యూట్ చేయాలని కోరిన రోహిత్ శర్మ
  • హార్దిక్ పాంఢ్యాతో కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత
టీం ఇండియా క్రికెట్ జట్టు సారథి, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు రోహిత్ శర్మ మాట్లాడిన ఓ సరదా సంభాషణ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ కెమెరా మ్యాన్ వైపు చూస్తూ రోహిత్ చేతులు జోడించి వేడుకున్న దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. 

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్ కు ముందు ఐపీఎల్ మాజీ ఆటగాడు ధావల్ కులకర్ణితో రోహిత్ పిచ్చాపాటిగా మాట్లాడాడు. వారి సంభాషణను ఐపీఎల్ కెమెరా మ్యాన్ వీడియో తీశాడు. దీన్ని గమనించిన రోహిత్ వెంటనే చేతులు జోడించి దయచేసి ఆడియోను నిలిపేయాలని అతన్ని కోరాడు. ‘సోదారా.. దయచేసి ఆడియో ఆపెయ్.. ఇప్పటికే ఒక ఆడియో నాకు చుక్కలు చూపించింది’ అంటూ వేడుకున్నాడు.

గత వారం కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కు ముందు రోహిత్, కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య సాగిన వీడియో సంభాషణ తీవ్ర దుమారం రేపింది. నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందులో రోహిత్ మాట్లాడుతూ ‘ఒక్కొక్కటిగా మారిపోతోంది. ఇక ఆ విషయం వారిపైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా కానీ ఇది నా ఇల్లు సోదరా.. ఈ గుడిని నేనే నిర్మించా’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాంఢ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లంతా కెప్టెన్ గా తనను తొలగించడం గురించే రోహిత్ అందులో మాట్లాడినట్లు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే రోహిత్ తాజాగా కెమెరామ్యాన్ ను తన వీడియోలో సంభాషణను మ్యూట్ చేయాల్సిందిగా కెమెరా మ్యాన్ ను కోరడం గమనార్హం. ఇక, లక్నోతో చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.


More Telugu News