యూఏఈ పదేళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా.. ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వారికి ‘బ్లూ రెసిడెన్సీ వీసా’
  • పదేళ్ల నివాస అనుమతితోపాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం
  • అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు, ఎన్టీవోలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ ద్వారా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం పదేళ్లు చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్సీ వీసాను ప్రారంభించింది. ఈ వీసా అందుకున్న వ్యక్తులకు పదేళ్ల నివాస అనుమతితోపాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తారు.

ఎవరికి ఇస్తారు?
సముద్ర జీవులు, భూ ఆధారిత పర్యావరణ వ్యవస్థలు, గాలి నాణ్యత, సుస్థిర సాంకేతికతలు, ఇతర రంగాలలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తులకు ఈ బ్లూ రెసిడెన్సీ వీసాను అందిస్తారు. దరఖాస్తుదారులకు కనుక అనుమతి లభిస్తే యూఏఈలో పదేళ్లు ఉండొచ్చు. అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు, సంఘాలు, ఎన్జీవోలు, గ్లోబల్ అవార్డు విజేతలు, విశిష్ట కార్యకలాపాలు నిర్వహించేవారు, పర్యావరణంలో పరిశోధనలు చేస్తున్నవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) ద్వారా బ్లూ రెసిడెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, దేశంలోని సమర్థులైన అధికారులు చేసిన నామినేషన్లు, ప్రతిపాదనలను కూడా ఫెడరల్ బాడీ ఆమోదించి బ్లూ వీసా అందిస్తుంది.

పలు వీసాలు ఆఫర్ చేస్తున్న యూఏఈ
యూఏఈ పలు వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. వాటిలో రెండేళ్ల చెల్లుబాటుతో హోస్ట్ వీసా అందిస్తుండగా, 2019లో ‘గోల్డెన్ వీసా’ను ప్రారంభించింది. ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, సైన్స్, విజ్ఞానం వంటి రంగాల్లో ఉన్న వారితోపాటు పదేళ్లు చెల్లుబాటు వ్యవధి కలిగిన విద్యార్థుల కోసం ఈ వీసాను జారీచేస్తుంది. అలాగే, విదేశీ పెట్టుబడిదారులు, నిపుణుల కోసం ‘గ్రీన్ వీసా’ను కూడా తీసుకొచ్చింది. దీనికి యజమాని స్పాన్సర్‌షిప్ అవసరం లేదు.


More Telugu News