ముఖంపై కొట్టాడు.. గుండెల్లో గుద్దాడు.. పొత్తికడుపులో తన్నాడు: స్వాతి మలివాల్

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆప్ నాయకురాలు స్వాతి మలివాల్
  • ఎఫ్ఐఆర్‌లో పలు విషయాలు పేర్కొన్న స్వాతి
  • ఆ వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు వైభవ్ కుమార్ తనపై దాడిచేశారని ఆరోపించిన ఆమె.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైభవ్ తనను ఏడెనిమిదిసార్లు ముఖంపై కొట్టాడని, గుండెల్లో గుద్దాడని, కడుపులో తన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.

‘‘సోమవారం ఉదయం కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. సీఎంను కలవాలని సిబ్బందికి చెప్పినా స్పందించలేదు. పక్కనే ఉన్న విశ్రాంతి గదిలో వెయిట్ చేయమని చెప్పారు. కాసేపటికే దూసుకొచ్చిన వైభవ్ కుమార్ నన్ను అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు. నా ముఖం మీద ఏడెనిమిదిసార్లు కొట్టాడు. చాతీపై గుద్దాడు. పొత్తికడుపులో తన్నాడు. నేను అప్పటికే పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నాను. విడిచిపెట్టాలని గట్టిగా అరిచాను. కానీ అతడు వదలకుండా దాడిచేస్తూనే ఉన్నాడు. హిందీలో దుర్భాషలాడుతూ ‘నీ సంగతి చూస్తా’నని బెదిరించాడు. సాయం కోసం బతిమాలినా ఎవరూ రాలేదు. దీంతో చివరికి అతడిని తోసేసి నేను బయటకు పరిగెత్తుకు వచ్చాను. అయినా వదలకుండా నా డ్రెస్ పట్టుకుని లాగాడు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మలివాల్ పేర్కొన్నారు. 

ఇంటి బయటకు వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వైభవ్ తనను బెదిరించాడని, తాను అప్పటికే ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వెంటనే కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.


More Telugu News