చివరి మ్యాచ్‌లోనూ ఓడి అవమానభారంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై

  • చివరి మ్యాచ్‌లో చెలరేగిన పూరన్.. 29 బంతుల్లో 75 పరుగులు
  • మళ్లీ విఫలమైన పాండ్యా, సూర్యకుమార్ యాదవ్
  • అట్టడుగు స్థానంతో ముంబై.. గౌరవప్రదంగా లక్నో టోర్నీ నుంచి నిష్క్రమణ
  • నేడు హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో రెండు జట్ల కథ ముగిసింది. గత రాత్రి ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ముంబైలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో లక్నో 18 పరుగులతో విజయం సాధించి టోర్నీ నుంచి గౌరవ ప్రదంగా నిష్క్రమించగా, ఓటమిని అలవాటుగా మార్చుకున్న ముంబై అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుని అవమాన భారంతో టోర్నీ నుంచి వైదొలగింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో 214 పరుగులు చేసింది. అనంతరం 215 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌శర్మ 68 (38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నమన్ ధీర్ 62 (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు)తో విరుచుకుపడినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో విజయం అందని ద్రాక్షే అయింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా, కెప్టెన్ పాండ్యా (16) మరోమారు దారుణంగా నిరాశపరిచాడు. డేవిడ్ బ్రెవిస్ 23, ఇషాన్ కిషన్ 14 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూరన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 75 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55, స్టోయినిస్ 28, ఆయుష్ బదోనీ 22*, కృనాల్ పాండ్యా 12* పరుగులు చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో తుషారా, చావ్లా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.  

ఈ మ్యాచ్‌తో ఇరు జట్ల కథ ముగిసింది. ఆడిన 14 మ్యాచుల్లో ముంబై నాలుగింటిలో మాత్రమే గెలవగా, లక్నో 7 మ్యాచుల్లో విజయం సాధించింది. ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టుకే మెరుగైన అవకాశాలున్నాయి. ఒకవేళ ఆర్సీబీ కనుక ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.


More Telugu News