టేకాఫ్‌కు ముందు టగ్ ట్రక్‌ను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం.. దెబ్బతిన్న ముక్కుభాగం

  • పూణె విమానాశ్రయంలో ఘటన
  • విమానాన్ని రన్‌వేపైకి తీసుకొచ్చిన వాహనాన్ని ఢీకొట్టిన వైనం
  • విమానంలో 180 మంది ప్రయాణికులు
  • విచారణకు ఆదేశించిన డీజీసీఏ
ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పూణె విమానాశ్రయంలో నిన్న పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు ముందు దానిని టేకాఫ్‌ కోసం రన్‌వే పైకి తీసుకొచ్చిన టగ్ ట్రక్‌నే ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ప్రమాదం కారణంగా విమానం ముక్కు భాగంతోపాటు ల్యాండింగ్ గేర్ సమీపంలోని టైరు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, విమానానికి అంతకుమించిన ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఘటన తర్వాత ప్రయాణికులందరినీ కిందికి దింపి విమానాన్ని మరమ్మతులకు పంపారు. ఆ తర్వాత వారిని ప్రత్యామ్నాయ విమానంలో ఢిల్లీకి పంపించారు. విమానం టగ్ ట్రక్‌ను ఢీకొనడానికి గల కారణంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనతో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.


More Telugu News