వికారాబాద్ అడవుల్లో తీసిన 'గుడ్లగూబపై మరో పక్షి దాడి' ఫొటోకు అంతర్జాతీయ అవార్డు

  • ఉత్తమ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ్ గా హైదరాబాద్ కు చెందిన పక్షి ప్రేమికుడి ఫొటోను ఎంపిక చేసిన ‘35అవార్డ్స్’ సంస్థ
  • ప్రపంచవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు పంపిన లక్షకుపైగా ఫొటోలను వడపోసిన 50 మంది సభ్యుల జ్యూరీ
  • మూడు రౌండ్ల ఓటింగ్ తర్వాత విజేతగా నిలిచిన గుడ్లగూబను వేధిస్తున్న నల్ల ఏట్రింత పక్షి ఫొటో
హైదరాబాద్ కు చెందిన ఐటీ నిపుణుడు, పక్షి ప్రేమికుడు హరి కె. పాటిబండ తీసిన ఓ ఫొటో అంతర్జాతీయ అవార్డు సాధించింది. పక్షి ప్రపంచంలో అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించినందుకు ‘ఉత్తమ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ్’గా ఎంపికైంది. వికారాబాద్ అడవుల్లో ఓ గుడ్లగూబ గాల్లో ఎగురుతుండగా దానిపై నల్ల ఏట్రింత (బ్లాక్ డ్రోంగో) అనే చిన్న పక్షి ఒక్కసారిగా వాలి వేధిస్తున్నప్పుడు హరి రెప్పపాటులో ఫొటో తీశారు. ఈ ఫొటోను ప్రముఖ అంతర్జాతీయ ఫొటో అవార్డుల సంస్థ ‘35అవార్డ్స్’కు పంపారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫొటోగ్రాఫర్లు పంపిన 1.15 లక్షల ఫొటోల్లో ఇది కూడా ఒకటి. చివరకు ఈ జాబితాలోంచి టాప్ 100 ఫొటోల్లో హరి తీసిన ఫొటో కూడా చోటు దక్కించుకుంది. చివరకు మూడు రౌండ్ల ఓటింగ్ తర్వాత 50 మంది న్యాయ నిర్ణేతల బృందం ఈ ఫొటోను పోటీలో విజేతగా ఎంపిక చేసింది. ఈ ఫొటోను తమ వెబ్ సైట్ లో ప్రదర్శించింది.

‘నల్ల ఏట్రింత పక్షులు చాలా దూకుడైనవి. వాటికన్నా పెద్ద సైజ్ లో ఉండే పక్షులపై దాడి చేసేందుకు కూడా అవి వెనకాడవు. కొన్ని రకాల గద్దలు, గుడ్ల గూబలపై దాడి చేస్తాయి. అవి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకు తరమికొడతాయి’ అని హరి చెప్పారు.

నల్ల ఏట్రింత పక్షిని నల్లపిట్ట, కత్తెర పిట్ట, పసుల పోలిగాడు, భరద్వాజము, పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట అని కూడా పిలుస్తుంటారు. దాదాపుగా దేశ మంతటా ఇది కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చిక బయళ్ళలో, పంటపొలాల గట్ల పైన, పట్టణ ప్రాంతాల్లో పెరటి చెట్లపైన, తీగల మీద దీనిని ఎక్కువగా గమనించవచ్చు. దీని తోక పొడువుగా ఉండి చివరలో చీలి చూడటానికి కత్తెరను పోలి ఉండటంతో దీనిని కత్తెరపిట్ట, మంగలి పిట్ట అని కూడా పిలుస్తారు.


More Telugu News