ఎన్నికల సంఘం విశ్వసనీయతపై విపక్షాల సందేహాలకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్లు

  • బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈసీ అసలైన స్వతంత్ర సంస్థగా మారిందన్న ప్రధాని
  • 50-60 ఏళ్లపాటు ఏక సభ్యుడితో ఈసీ కొనసాగిందంటూ కాంగ్రెస్‌కు చురకలు
  • ఎన్నికల అధికారులు ఆ తర్వాత గవర్నర్లు, ఎంపీలు అయ్యారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సంఘం అసలైన స్వతంత్ర సంస్థగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలకు ప్రధాని ఈ సమాధానం ఇచ్చారు. విపక్షాల వాదనను ఆయన ఖండించారు. గతంలో 50-60 ఏళ్ల పాటు ఎన్నికల సంఘంలో ఒక్కరే సభ్యులుగా ఉండేవారంటూ కాంగ్రెస్‌ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. గతంలో ఒక పార్టీకి సన్నిహితంగా మెలిగే వ్యక్తులను ఎన్నికల కమిషనర్లుగా నియమించేవారని ఆరోపించారు. బీజేపీకి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆప్ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా టుడే టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన స్పందించారు.

‘‘దాదాపు 50-60 ఏళ్లపాటు ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా ఉంది. ఎన్నికల సంఘంలో పనిచేసిన అధికారులు ఆ తర్వాత గవర్నర్‌లు, ఎంపీలు లేదా ఎల్‌కే అద్వానీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు పదవీ విరమణ చేసిన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికి కూడా అదే రాజకీయ తత్వాన్ని ప్రచారం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వారు వారి అభిప్రాయాలను తెలియజేస్తారు, కథనాలు రాస్తారు. దీనిర్థం ఎన్నికల కమిషన్ ఇప్పుడు పూర్తిగా స్వతంత్రంగా మారిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. కాగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ 1999 లోక్‌సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ నుంచి ఎల్‌కే అద్వానీపై పోటీ చేశారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసిన ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ అంశాన్నే మోదీ ప్రస్తావించారు.

కాగా 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి, రెండవ దశ ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో వ్యత్యాసాలపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రధాని మోదీ ఖండించారు. ఇది నిపుణులు చర్చించాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మొదటి, రెండో దశ లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించిన తుది డేటా ప్రకటనలో జాప్యంపై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. దీంతో వివాదం మొదలైంది. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం కూడా ఖండించింది. ఎలాంటి దుర్వినియోగం జరగలేదని వివరణ ఇచ్చింది. ఇక మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు కొన్ని రోజుల ముందు మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఎన్నికల సంఘం నుంచి ఆకస్మికంగా వైదొలగడంతో బీజేపీపై విపక్ష పార్టీలు విమర్శల దాడి చేసిన విషయం తెలిసిందే.


More Telugu News