సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ రద్దయ్యాక ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇవే

  • మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల ఖరారు
  • టాప్-3లో వరుస స్థానాల్లో నిలిచిన కోల్‌కతా, రాజస్థాన్, సన్‌రైజర్స్ జట్లు
  • చివరి స్థానం కోసం నాలుగు జట్ల పోటీ
  • చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యే అసలు పోరు
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. చెరొక పాయింట్ లభించడంతో మొత్తం 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడవ జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 13 మ్యాచ్‌లు ఆడి 19 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో, 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచాయి. ఇక తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

ఒక్క స్థానం కోసం 4 జట్లు పోటీ..
మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారవ్వడంతో మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో ఉన్నాయి. అయితే అసలుసిసలైన పోటీ సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్యే నెలకొంది.

చెన్నై సూపర్ కింగ్స్
ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సి ఉంది. ఆర్సీబీపై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా చెన్నై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో టాప్-2 స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు చెన్నైకి ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, +0.387 నెట్‌ రన్ రేట్‌తో ఉంది. తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. గెలవడమే కాదు చెన్నై సూపర్ కింగ్స్‌ని నెట్ రన్ రేట్‌ అధిగమించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశం ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, మైనస్ 0.787 నెట్ రన్ రేట్‌తో ఉంది. తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో లక్నో తలపడనుంది. ప్రస్తుత నెట్ రన్ రేట్‌ భారీ మైనస్‌లో ఉండడంతో ముంబైపై గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. టెక్నికల్‌గా అవకాశం కనిపిస్తున్నా అది దాదాపు అసాధ్యం.

ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు, మైనస్ 0.377 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆ జట్టు లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. రన్ రేట్‌ను మెరుగుపరచుకునేందుకు మ్యాచ్‌లు లేకపోవడంతో ప్లేఆఫ్ రేసు నుంచి ఢిల్లీ దూరమైంది. ఆర్సీబీ, సీఎస్కే జట్లలో ఏదో ఒకటి మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఉంటుంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి చేరింది.


More Telugu News