సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కపిల్ సిబల్ గెలుపు

  • ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌పై విజయం సాధించిన సిబల్
  • గురువారం జరిగిన ఎన్నికలు
  • అత్యధికంగా 1066 ఓట్లు పడడంతో కపిల్ సిబల్ గెలుపు
ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడిగా గురువారం ఎన్నికయ్యారు. ఎస్‌సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా గురువారం ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌ని ఆయన ఓడించారు. కపిల్ సిబల్‌కి 1066 ఓట్లు పడగా ప్రదీప్ రాయ్‌కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటివరకు ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదీశ్ అగర్వాల్‌కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు.

కపిల్ సిబల్ విజయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఉదారవాద, లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి దిగిపోబోతున్న ప్రధానమంత్రికి ఇది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో జాతీయ స్థాయిలో మార్పు జరగనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సిబల్ 
కపిల్ సిబల్ హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చదివారు. 1983లో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు. 1989-90 సమయంలో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో 1995 నుంచి 2002 మధ్య కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేశారు. కేంద్రమంత్రిగానూ ఆయన పనిచేసిన విషయం తెలిసిందే.


More Telugu News