మా లాభాల్లో అధికశాతం ప్రభుత్వం తీసుకుంటోంది.. ఆర్థికమంత్రికి స్టాక్ బ్రోకర్ ఫిర్యాదు

  • విజన్ ఫర్ ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిర్మలాసీతారామన్
  • అధిక పన్నులపై సమావేశంలో స్టాక్ బ్రోకర్ ఫిర్యాదు
  • రిస్క్ తాము తీసుకుంటుంటే లాభాలు ప్రభుత్వం లాగేసుకుంటోందని వ్యాఖ్య
  • ప్రభుత్వం తమకు స్లీపింగ్ పార్టనర్‌గా మారినట్టు ఉందని కామెంట్
  • స్లీపింగ్ పార్టనర్‌లుగా తాము ప్రస్తుతానికి సమాధానం చెప్పలేమని మంత్రి సరదా వ్యాఖ్య
స్టాక్ మార్కెట్ లో అధిక పన్నులపై ఓ స్టాక్ బ్రోకర్ ఆర్థిక మంత్రికి చేసిన ఫిర్యాదు ఓ సభలో నవ్వులు పూయించింది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘‘విజన్ ఫర్ ఇండియన్ ఫైనాన్స్ మార్కెట్స్’’ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధిలో స్టాక్ మార్కెట్ల పాత్రపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ స్టాక్ బ్రోకర్ మాట్లాడుతూ తన ఆవేదనను సరదా పుట్టించే రీతిలో పంచుకున్నాడు. 

‘‘స్టాక్ బ్రోకర్లుగా మేము చాలా పన్నులు చెల్లించాల్సి వస్తోంది. జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్, ఐటీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ, ఎల్‌టీజీసీ వంటివన్నీ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం స్టాక్ బ్రోకర్ల కంటే ఎక్కువ ఆర్జిస్తోంది. మేమేమో అధిక రిస్క్ తీసుకుంటుంటే ప్రభుత్వమేమో లాభాల్లో అధిక వాటా తీసుకెళుతోంది. మేమేమో వర్కింగ్ పార్ట్‌నర్‌గా, ప్రభుత్వమేమో స్లీపింగ్ పార్టనర్‌గా మారిపోయినట్టు ఉంది. ఇళ్లు కొనడం కూడా సామాన్యులకు కష్టతరంగా మారింది’’ అని కామెంట్ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ ఓ స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వం ఈ వేదిక నుంచి దీనికి సమాధానం చెప్పలేదని కామెంట్ చేయడంతో సభలో నవ్వులుపూసాయి. 

కాగా, దేశాభివృద్ధికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సభలో పేర్కొన్నారు. వీటి ఫలితంగా మునుపెన్నడూ చూడని స్థాయిలో మౌలిక వసతుల కల్పన జరిగిందన్నారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 2014 నుంచి ఇప్పటివరకూ 3.74 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. మెట్రో ప్రాజెక్టుల కారణంగా నగరాల్లో అనుసంధానత పెరిగిందని కూడా అన్నారు.


More Telugu News