బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ జిల్లా వాసి ఉదయ్ నాగరాజ్

  • బ్రిటన్‌లో కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజ్ పోటీ
  • లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఉదయ్
  • బ్రిటన్‎లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‎లో అడ్మినిస్ట్రేటివ్‎ సైన్స్‎లో పీజీ చేసిన ఉదయ్
  • ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‎ని నెలకొల్పిన ఉదయ్ నాగరాజ్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజ్ పోటీ చేస్తున్నారు. ఆయన లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి లేబర్ పార్టీ గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కేవలం ఇక్కడి నుంచే కాదు... బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఉదయ్ నాగరాజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. నాగరాజ్ తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. ఉదయ్ నాగరాజ్ అంచలంచెలుగా ఎదిగారు.

బ్రిటన్‎లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‎లో అడ్మినిస్ట్రేటివ్‎ సైన్స్‎లో పీజీ చేశారు. ప్రస్తుత సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‎ని నెలకొల్పారు. వక్తగా, రచయితగా ఆయనకు మంచి పేరు ఉంది.

క్షేత్రస్థాయి సమస్యలపై ఉదయ్ నాగరాజ్‌కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్‎గా, వాలంటీర్‎గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా పని చేశారు. దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారం చేయడం ద్వారా ఆయన సామాన్యుల కష్టాలపై అవగాహన కలిగి ఉన్నారు.  


More Telugu News