జూన్ 4న ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ కు గురవుతారు: దేవినేని ఉమా

  • ఇవాళ విజయవాడలో ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన సీఎం జగన్
  • 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా
  • ఏం ఉద్ధరించావని నీకు ఓట్లేస్తారు? అంటూ దేవినేని ఉమా ఫైర్
  • జగన్ భ్రమలన్నీ జూన్ 4న తొలగిపోతాయని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ సీఎం జగన్ విజయవాడలో ఐప్యాక్ కార్యాలయానికి వచ్చి... 151కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు. 

మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ, జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ షాక్ కు గురవుతాడని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. 

"ఐదేళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గ పరిపాలన చూసి... దేశవిదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలకు గ్రామాలు మండుటెండలో మూడ్నాలుగు గంటలు నిలబడి ప్రజలు ఓటేశారు. అటు వెయ్యిమంది, ఇటు వెయ్యిమంది రాళ్లు విసురుకుంటున్నా... పల్నాడులో మహిళలు కాంపౌండ్ వాల్ దాటిపోకుండా నిలబడి ఓటేసి ఈ  ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డీ?

ఈ ఐదేళ్లు ఏం ఉద్ధరించావని మళ్లీ అధికారంలోకి వస్తావని కలలు కంటున్నావు? నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్న జగన్ రెడ్డి... ఐప్యాక్ టీమ్ సభ్యులతో మాట్లాడి జబ్బలు చరుచుకుంటున్నాడు, గప్పాలు కొడుతున్నాడు. 

ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరంలో కదం తొక్కుతున్నప్పుడు కూడా మనమే గెలవబోతున్నాం అని నియంత హిట్లర్ తన సైన్యానికి చెప్పాడు. హిట్లర్ లేనప్పుడు  కూడా... మనమే గెలవబోతున్నాం అంటూ గోబెల్స్ కూడా ఇలాగే ప్రచారం చేశాడు. రాష్ట్రంలో సజ్జల కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. 

ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి జగన్? వై నాట్ పులివెందుల అని ఇవాళ కడప జిల్లాలోనే అంటున్నారు. కడప ఎంపీ సీటు కూడా మేమే గెలవబోతున్నాం అనే సమాచారాలు బయటికొస్తున్నాయి. ఓవైపు మీడియా, సోషల్ మీడియా, దేశమంతా ఘోషిస్తుంటే తట్టుకోలేక మూడ్రోజుల తర్వాత ఇవాళ బయటికొచ్చాడు. 

నువ్వు పెంచి పోషించిన ఈ ఐప్యాక్ వాలంటీర్లను అడ్డంపెట్టుకుని ఎంతో కీలమైన డేటా చోరీ చేసింది. వాలంటీర్ల సాయంతో జగన్ ప్రజల వ్యక్తిగత  సమాచారాన్ని ఐప్యాక్ టీమ్ కు కట్టబెట్టాడు. చంద్రబాబు నాయకత్వంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో ఈ అంశం పరిశీలనకు వస్తుంది. 

బాబాయ్ ను చంపినందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు పెంచి, పన్నులు పెంచి రూ.8 లక్షల కోట్ల భారం వేసినందుకు, పేదల రక్తాన్ని పీల్చినందుకు నీకు ఓటేస్తారా? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, అన్ని నిధులు లక్షన్నర కోట్లు మళ్లించి, ఏం ఉద్ధరించావని పగటి కలలు కంటున్నావు జగన్ రెడ్డీ? అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నం పెడితే ఓర్వలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓర్వలేకపోయావు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 100కి పైగా పథకాలు రద్దు చేశావు... దేనికి కలలు కంటున్నావు? 

మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నావు... అవన్నీ మర్చిపోయావు. దేనికి నీ మిడిసిపాటు? నాసిరకం, విషపూరిత మద్యంతో 35 వేల కుటుంబాల్లో పుస్తెలు తెంచినందుకా? కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఇసుక ధరలు పెంచినందుకా... మీరు గెలుస్తారని ఎగిరెగిరిపడుతున్నారు! 

ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రం పార్లమెంటులో చెబితే, సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వానికి లేదు. జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు ఎంతో కసిగా, యువత పోలింగ్ బూత్ ల వద్దకు ఓటేస్తే... తట్టుకోలేక 72 గంటల తర్వాత బయటికొచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 ఎంపీలు గెలుస్తా అని గప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డీ?

రివర్స్ పీఆర్సీ ఇచ్చినందుకా నీకు ఓటేస్తారు? 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు నాలుగు రోజుల  పాటు మండుటెండల్లో నిలబడి ఓటేశారు. వాళ్ల కుటుంబ సభ్యులు బూత్ లకు వచ్చి కసిగా ఓటేశారు... వీళ్లు కనబడడంలేదా జగన్ రెడ్డీ? పోలవరాన్ని గోదావరిలో ముంచేశావు, నదుల అనుసంధానాన్ని ముంచేశావు, రాయలసీమ ప్రాజెక్టును గాలికి వదిలేశావు... రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతావు... ఇందుకా నీ మిడిసిపాటు... ఇందుకా నీకు ఓట్లేస్తారని కలలు కంటున్నావు? 

ప్రజా రాజధాని అమరావతిని ధ్వంసం చేసి, మూడు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి, వందలాది రోజుల పాటు ఉద్యమం చేసిన రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు  పెట్టి వాళ్లను జైలు పాల్జేస్తే వాళ్ల ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వానికి తగలదా? స్థానిక సంస్థలకు ఇచ్చిన 12 వేల కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించినందుకా నీకు ఓటేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డీ? 

అసత్య ప్రచారాలతో జగన్ రాష్ట్ర ప్రజలను ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బయటికొచ్చాడు. ఇప్పుడు లండన్ ప్యాకప్ అవుతున్నాడు. జూన్ 1వ తేదీన మళ్లీ రెండు వారాల పొడిగింపు కోరుతూ సీబీఐ కోర్టును కోరతాడు. 

వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా... మళ్లీ ఓట్ల లెక్కింపు రోజున మిమ్మల్ని కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారం చేస్తున్నాడు. జీతభత్యాలేవీ లేకుండా సజ్జల భార్గవ రెడ్డిని, ఇతరులందరీ వెళ్లగొట్టేశాడని సోషల్  మీడియాలో, మీడియాలో బయటికి వచ్చింది. అందుకే ఇవాళ జగన్ ఐప్యాక్ దొంగల ముఠా వద్దకు వచ్చి వాస్తవాలను కప్పిపుచ్చి, ప్రజలను, వైసీపీ శ్రేణులను నమ్మించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు" అంటూ దేవినేని ఉమా స్పష్టం చేశారు.


More Telugu News