రైతులకు రుణమాఫీ చేస్తారా? చేయరా? రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాలి: బూర నర్సయ్య గౌడ్

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి... ఆ తర్వాత మోసం చేసిందని విమర్శ
  • సీఎం దేవుడి మీద ప్రమాణాలు చేయడం చూస్తుంటే 'దేవుడి మీద ఒట్టు' దొంగతనం చేయలేదన్నట్లుగా ఉందని వ్యాఖ్య
  • కార్పోరేషన్ పేరు మీద రైతులను మరోసారి మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శ
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారా? చేయరా? అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాలని మాజీ ఎంపీ, భువనగిరి లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నిలదీశారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు కాదు... ఆరు మోసాలు చేసిందని మండిపడ్డారు.

రైతులను, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో దేవుడి మీద ప్రమాణాలు చేయడం చూస్తుంటే 'దేవుడి మీద ఒట్టు' దొంగతనం చేయలేదని ఆయన అన్నట్లుగా ఉందన్నారు. కార్పోరేషన్ పేరు మీద రైతులను మరోసారి మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేసే వరకు బీజేపీ వదిలిపెట్టదన్నారు.


More Telugu News