లిక్కర్ రాణి కవితను జైలు నుంచి విడిపించేందుకు కేసీఆర్ బీజేపీకి ఓట్లేయించారు.. ఆధారాలు ఉన్నాయి: కేకే మహేందర్ రెడ్డి

  • పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారన్న కేకే
  • బీజేపీకి ఓటు వేయమని బీఆర్ఎస్ నేతలే చెప్పారన్న మహేందర్ రెడ్డి
లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి ఓట్లు వేయించారని కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. తన దగ్గర ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వెయ్యండని బీఆర్ఎస్ నేతలే చెప్పారని పేర్కొన్నారు.

పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలీలను అనలేదని... ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు ప్రభుత్వం అనుమతించిన వాటిని అమ్ముకుంటే తప్పేమిటని వ్యాఖ్యానించారు. కూతురు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ వద్ద మోకరిల్లిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు.

కేసీఆర్ ప్రధాని మోదీ కనుసన్నుల్లోనే ఉన్నారన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని స్వయంగా కేసీఆర్ తనను అడిగినట్లు ప్రధానే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటో తెలియాలన్నారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు కోన్ కిస్కా అని మండిపడ్డారు.

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేశారని, సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి ఆయన పొలాలకు నీళ్లు తీసుకెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీకి పాల్పడ్డారన్నారు.


More Telugu News