బలవంతపు వ్యభిచారం కేసులో అరుణాచల్ ప్రదేశ్ డీఎస్పీ అరెస్టు

  • ఇటానగర్‌లో బ్యూటీపార్లర్ మాటున వ్యభిచారం
  • పొరుగు రాష్ట్రాల నుంచి బాలికలను తీసుకొచ్చి రొంపిలోకి దించిన వైనం
  • కేసులో ఓ డీఎస్పీ సహా ఐదుగురు ప్రభుత్వ అధికారుల అరెస్టు
  • మొత్తం 21 మందిని అరెస్టు చేసిన పోలీసులు
అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్‌ కేసులో రాష్ట్రానికి చెందిన ఓ డీఎస్పీ కూడా అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఈ రాకెట్‌లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. 10 - 15 ఏళ్ల లోపు ఉన్న ఐదుగురు బాలికలను కూడా రక్షించారు. అరెస్టైన వారిలో ఒక డీఎస్పీ, హెల్త్ సర్వీసె డిప్యూటీ డైరెక్టర్ కూడా ఉండటం కలకలానికి దారి తీసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటానగర్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్‌కు తీసుకొచ్చారు. చింపులో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4న వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మైనర్లను రక్షించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు కూడా సమాచారం అందించారు. 

నిందితుల అధీనంలో మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. మరో బాలికను ఇతర ప్రాంతానికి తరలించినట్టు తెలుసుకుని వీరందరినీ రక్షించి ప్రస్తుతానికి వసతి గృహానికి తరలించారు. ఈ కేసులో ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 11 మంది విటులు పోలీసులకు చిక్కారు.


More Telugu News