అందుకే పాక్ లో విడాకులు పెరిగిపోయాయి: మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • మహిళలు ఉద్యోగాల్లో చేరడం కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని వ్యాఖ్య
  • ఆర్థిక స్వాత్రంత్యం రావడం వల్ల ఇంటిని నడుపుతూ, భర్తలను పట్టించుకోవట్లేదని ఆరోపణ
  • అందువల్లే పాక్ లో గత మూడేళ్లలో 30 శాతం విడాకుల శాతం పెరిగిందని కామెంట్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ స్టార్ ఓపెనర్ సయీద్ అన్వర్ మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశంలో భార్యాభర్తల విడాకుల ఉదంతాలు పెరిగిపోవడానికి మహిళలు ఎక్కువగా ఉద్యోగాల్లో చేరడమే కారణమని సూత్రీకరించాడు. ఆర్థిక స్వతంత్రం కారణంగా ఇంట్లోని వారిని తామే పోషించాలని మహిళలు నిర్ణయించుకుంటున్నారని విమర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  అన్వర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

‘పాకిస్థాన్ లో మహిళలు పనిచేయడం మొదలుపెట్టారు. అందుకే గత మూడేళ్లలో దేశంలో విడాకుల రేటు 30 శాతం పెరిగింది. ఇప్పుడు భార్యలు ఏమంటున్నారంటే.. నాకు నేను సంపాదించుకోగలను. నా ఇంటిని నేను నడపగలను. అందుకే నిన్ను నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అని మహిళలు అంటున్నట్లు అన్వర్ కామెంట్ చేశాడు. సరైన గైడెన్స్ లేకపోతే మహిళలు ఆడుతున్న ఈ ఆట అర్థంకాదని వ్యాఖ్యానించాడు.

‘నేను ప్రపంచమంతా తిరిగాను. ఇప్పుడే ఆస్ట్రేలియా, యూరొప్ నుంచి తిరిగొస్తున్నా. యువత బాగా కష్టాలు పడుతోంది. కుటుంబాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆడవారిని పనికి పంపాల్సిన పరిస్థితి వస్తోంది’ అని అన్వర్ అన్నాడు.

న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మేయర్ కూడా ఇదే అభిప్రాయాన్ని తన ముందు వ్యక్తం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మన సమాజం ఎప్పుడు మెరుగుపడుతుందని కేన్ విలియమ్సన్ అడిగాడు. మహిళలు ఉద్యోగాలు చేయడం వల్ల సంస్కృతి నాశనమైందని ఆస్ట్రేలియా మేయర్ నాతో అన్నారు’ అంటూ అన్వర్ చెప్పుకొచ్చాడు. 

అయితే అన్వర్ వ్యాఖ్యలను సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది మహిళలను కించపరచడమేనని, తిరోగమన ఆలోచనా విధానమని ఓ యూజర్ విమర్శించారు. మరొకరేమో వాళ్ల (పాక్) ఆలోచనా విధానాన్ని ఎవరూ మార్చలేరని ఎద్దేవా చేశారు. అన్వర్ భార్య ఒక డాక్టర్ అని, అయినా అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మరొకరు కామెంట్ పెట్టారు.


More Telugu News