నా గురించి ఆయనకు సమాచారం ఎవరు ఇచ్చారో?: అమిత్ షాపై ప్రియాంక గాంధీ ఆగ్రహం

  • మహిళల కార్యకలాపాలపై నిఘా వేయడం ఏమిటని మండిపాటు
  • మహిళలు ఎవరు ఏం చేస్తుంటారు, ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే దానిపై దృష్టి సారిస్తారని ఆరోపణ
  • అమిత్ షా చెప్పినట్లు తాను థాయ్‌లాండ్ వెళ్లింది వాస్తవమేనన్న ప్రియాంక గాంధీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల కార్యకలాపాలపై ఆయన నిఘా వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సహా ఎవరు ఏం చేస్తుంటారు? ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు? అనే దానిపై ఆయన దృష్టి సారిస్తుంటారన్నారు. తాను కొన్నిరోజుల క్రితం తన కూతురును చూసేందుకు థాయ్‌లాండ్ వెళ్లానని... ఈ అంశాన్ని అమిత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారన్నారు.

'అవును... నేను థాయ్‌లాండ్ వెళ్లాను. అయితే ఈ సమాచారం ఆయనకు ఎవరు ఇచ్చారో చెప్పగలరా? ఆయన దగ్గర సమాచారం ఉన్ననప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి?' అని ప్రియాంక మండిపడ్డారు.

అంతకుముందు, అమిత్ షా మాట్లాడుతూ... గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో మాత్రమే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని విమర్శించారు. ఆ నియోజకవర్గాలను గాంధీ కుటుంబం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సోనియాగాంధీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని... మరి రాహుల్, ప్రియాంక గాంధీ మాటేమిటని నిలదీశారు. గతంలో రాయ్‌బరేలి నియోజకవర్గంలో పలు దురదృష్టకర సంఘటనలు జరిగినా గాంధీ కుటుంబసభ్యులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. కొందరు క్రమం తప్పకుండా థాయ్‌లాండ్, బ్యాంకాక్ వెళతారని ఎద్దేవా చేశారు.


More Telugu News