సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలని ఈసీ పిలిచిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు: అంబటి రాంబాబు

  • టీడీపీ హింసకు పాల్పడిందంటూ డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు
  • పోలీసు అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందన్న అంబటి
  • తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెపుతుందని ప్రశ్న
పోలింగ్ సమయంలో టీడీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడిందని డీజీపీకి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగు నాగార్జున ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ బూత్ వద్ద టీడీపీ శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే పోలీసులు అడ్డుకోలేదని చెప్పారు. ఎన్నికల విధులను నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. కొంత మంది పోలీసులు టీడీపీకి అనుకూలంగా పని చేశారని విమర్శించారు. 

కూటమి నేతల ఫిర్యాదుతో పోలీసు అధికారులను ఈసీ మార్చిందని... అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందని అంబటి ప్రశ్నించారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని... టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారని విమర్శించారు. టీడీపీ బూత్ క్యాప్చరింగ్ చేసిందని, ఈవీఎంలపై దాడులకు పాల్పడిందని చెప్పారు. వైసీపీకి ఓట్లు ఎక్కువగా పడే చోట్ల ఎక్కువ మంది పోలీసులను పెట్టారని, టీడీపీకి బలమైన గ్రామాల్లో తక్కువ పోలీసులను పెట్టారని దుయ్యబట్టారు. అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వల్లే హింస జరిగిందని అన్నారు. 

పోలీసు అధికారులను మార్చే విషయంలో ఎన్నికల కమిషన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి ఫిర్యాదులు, ఢిల్లీ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. తాజాగా సీఎస్, డీజీపీలను ఈసీ ఢిల్లీకి పిలిచిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెపుతుందని ప్రశ్నించారు. వెబ్ కెమెరాలను పరిశీలించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుందని అడిగారు.


More Telugu News