కాశీలో మోదీతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ నేపథ్యం ఇదే..!

  • ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల నుంచి ఎదిగిన నేత
  • బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఎస్పీలో చేరిక
  • వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. గత రెండు పర్యాయాలు రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రధాని.. మూడోసారి కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మరోసారి మోదీతో తలపడుతున్నారు. ఈసారి మోదీని ఓడించితీరాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. 

ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి ఏబీవీపీ నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజయ్ రాయ్.. బీజేపీ టికెట్ నిరాకరించడంతో బీఎస్పీలో చేరారు. యూపీ ప్రభుత్వంలో మంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన అజయ్ రాయ్.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ గా కొనసాగుతున్నారు. యూపీలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కూడా అజయ్ రాయ్ కి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అజయ్ రాయ్ ని వారణాసి నుంచి మోదీకి పోటీగా నిలబెట్టింది. తాజాగా మరోమారు ఆయననే బరిలోకి దింపింది.

అజయ్ రాయ్ గురించి కొన్ని విశేషాలు..
వారణాసిలో 1969 అక్టోబర్ 7 న సురేంద్ర రాయ్, పార్వతీ దేవీ రాయ్ దంపతులకు జన్మించారు. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ కన్వీనర్ గా సేవలందించారు.

1996లో బీజేపీ టికెట్ తో కొలస్లా నియోజకవర్గం నుంచి గెలిచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో సమాజ్ వాదీ పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అయితే, ఆ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఓటమి పాలయ్యారు.
అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 2012 లో పింద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2014లో వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాల్లో నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ తర్వాతి స్థానంలో నిలిచారు. 
2019లో మరోమారు అక్కడి నుంచే పోటీ చేసి మోదీ చేతిలో ఓటమిపాలయ్యారు. 2013లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ గా అజయ్ రాయ్ నియమితులయ్యారు.


More Telugu News