పదిమంది కోసం షో వేయలేం.. అందుకే బంద్: థియేటర్ యజమానుల ఆవేదన

  • తెలంగాణలో పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్
  • ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ తో థియేటర్ల వైపు చూడని జనం
  • పెద్ద సినిమాల విడుదల వాయిదా.. చిన్న సినిమాలకు ఆదరణ కరవు
వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి.. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశమే దీనికి కారణం. మూడు గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఈ సమ్మర్ లో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా జనం థియేటర్ల వంక చూడడంలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు నష్టాలు తప్పట్లేదు. తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని థియేటర్ యజమానులు చెబుతున్నారు. 

ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి నష్టాలేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్పారు. ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే వస్తున్నారని, టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంట్ బిల్లుకే సరిపోవడంలేదని వాపోతున్నారు. పదిమంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు భారంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలో పలు చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ నేపథ్యంలో ఆ సినిమాలు విడుదలవుతాయా? లేక వాయిదా పడతాయా అనేది చూడాలి! 


More Telugu News