ప్రత్యర్థుల గొడ్డలి దాడిలో నుదుటికి గాయమై రక్తమోడుతున్నా పోలింగ్ కేంద్రానికి.. ఎందుకో చెప్పిన మంజుల

  • పల్నాడు జిల్లా రెంటాలలో రెచ్చిపోయిన అల్లరిమూకలు
  • పోలింగ్ కేంద్రానికి ఏజెంట్ వెళ్లకుండా కత్తులు, గొడ్డళ్లతో దాడి
  • రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లానన్న మంజుల
  • తనపై దాడిచేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్
రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకే తాను ఏజెంట్‌గా కూర్చొన్నానని పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. సోమవారం పోలింగ్ జరుగుతుండగా వైసీపీ వర్గీయులుగా చెబుతున్న కొందరు ఆమెపై దాడిచేశారు. నుదుటిపై గొడ్డలి వేటు పడడంతో తీవ్ర రక్తస్రావమైనా ఆసుపత్రికి వెళ్లకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఏజెంట్‌గా కూర్చొన్నారు.  

తాజాగా ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో దాడులు చేసుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడడం సర్వసాధారణంగా మారిందని, ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి, ఎవరి ఓటు వారు వేసుకునే వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతోనే ఏజెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో మూడేళ్లుగా హోటల్ వ్యాపారం చేస్తున్నానని, ఓటు వేసేందుకు సోమవారం తెల్లవారుజామునే గ్రామానికి చేరుకున్నట్టు చెప్పారు. 

మరోవైపు, పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లుగా ఎవరూ కూర్చోకుండా దాదాపు 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కత్తులు, గొడ్డళ్లతో రోడ్డుపైకి చేరుకున్నారని ఆమె పేర్కొన్నారు. విషయం పోలీసులకు చెప్పి పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని కోరామని పేర్కొన్నారు. ఎస్సైని పంపుతామని సీఐ చెప్పినప్పటికీ రాకపోవడంతో చేసేది లేక మరిది చేరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తోటికోడలు చేరెడ్డి వీణతో కలిసి పోలింగ్ కేంద్రానికి బయలుదేరినట్టు చెప్పారు.

ఇది చూసిన ప్రత్యర్థులు తమపై కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసినట్టు మంజుల వివరించారు. ఎంత ధైర్యం ఉంటే పోలింగ్ ఏజెంట్‌గా కూర్చుంటారంటూ తమపై దాడికి పాల్పడ్డారని, తన చెంపలపై కొట్టడంతోపాటు గొడ్డలితో నుదుటిపై గాయం చేశారని, తన కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారని తెలిపారు. రక్తం కారుతున్నా సరే రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు పోలింగ్ కేంద్రానికే వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బాధను భరిస్తూ పోలీసులు వచ్చే వరకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్నానని, ఆ తర్వాత వారొచ్చి గురజాల ఆసుపత్రిలో చేర్చించి ఫిర్యాదు తీసుకున్నారని తెలిపారు. తమపై దాడిచేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని, వారికి శిక్షలు పడితేనే భయం ఉంటుందని మంజుల పేర్కొన్నారు.


More Telugu News