భారత్ లో మూడోసారి మోదీయే రావాలి.. పాక్ కూ అలాంటి నేత కావాలి: పాక్‌ అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్‌

  • ప్రపంచానికి కూడా మోదీలాంటి నాయకుడి అవసరం ఉందన్న సాజిద్
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ పాక్ లో పర్యటించారని మోదీపై ప్రశంసలు
  • భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుందని వ్యాఖ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మత: నాయకుడని, ఆయన నాయకత్వం భారత్ కు మాత్రమే కాదు ప్రపంచానికీ అవసరం ఉందని పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కూ మోదీలాంటి నాయకుడు కావాలని అన్నారు. పాకిస్థాన్ కు చెందిన సాజిద్ తరార్ అమెరికాకు వలసవెళ్లి అక్కడే సెటిలయ్యారు. భారత్ లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు సాజిద్ తరార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మోదీ ధైర్యంగా పాకిస్థాన్ లో పర్యటించారని గుర్తుచేశారు. మూడోసారి కూడా భారత ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరుకున్నారు. అలాగే, పాకిస్థాన్ తో చర్చలు జరిపి ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడేలా చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత ప్రజాస్వామ్యం భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుందని సాజిద్ తరార్ చెప్పారు. 97 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం ఓ అద్భుతమని అన్నారు. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మోదీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని చెప్పారు. కాగా, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు మోదీలాంటి నాయకుడి అవసరం ఉందని సాజిద్ పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అల్లర్లకు కారణం ఆర్థిక సంక్షోభమేనని అన్నారు. పీవోకేలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను ఇతర టౌన్ లకు సరఫరా చేయడంతో స్థానికంగా విద్యుత్ కొరత ఏర్పడిందని, విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయని చెప్పారు. దీంతో పీవోకే ప్రజలు నిరసనలకు దిగారని వివరించారు. నిరసనకారులతో చర్చించాల్సిన ప్రభుత్వం.. బలగాలతో బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసిందని సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు.


More Telugu News