నేనింతే .. రేపటి సంగతి రేపు చూద్దాం: హాస్య నటి కోవై సరళ

  • ఎంజీఆర్ ను చూసి నటన వైపు వచ్చానని వెల్లడి 
  • బయట కూడా తన బాడీ లాంగ్వేజ్ ఇదేనని వ్యాఖ్య
  • తనపై తనకున్న నమ్మకమే బ్రతికిస్తుందని స్పష్టీకరణ

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన నటి కోవై సరళ. ఆమె వాయిస్ .. బాడీలాంగ్వేజ్ లోని ప్రత్యేకతను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి కోవై సరళ 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "నేను పుట్టి పెరిగింది కోయంబత్తూర్ లో. మొదటి నుంచి కూడా నేను ఎంజీఆర్ అభిమానిని. ఆయన సినిమాలు చూసే నాకు నటనపట్ల ఆసక్తి ఏర్పడింది" అని అన్నారు. 

" తెలుగులో నాకు ఇష్టమైన హాస్యనటులు .. అలీ గారు .. బ్రహ్మానందంగారు. నేను - బ్రహ్మానందం గారు కలిసి ఒక 100 సినిమాల్లో నటించి ఉంటాము. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషలో కలుపుకుని 900 సినిమాలలో నటించాను. ఇది నా ఒరిజినల్ వాయిస్ .. బాడీ లాంగ్వేజ్. ఇవి సినిమా కోసం తెచ్చిపెట్టుకున్నవి కాదు. నన్ను అంతా ఎలా చూస్తున్నారో .. అదే నేను" అని చెప్పారు. 

" పెళ్లి చేసుకోకపోతే ఎట్లా .. రేపటి రోజున ఎవరు చూస్తారు? అని అంతా అడుగుతున్నారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ చూస్తారనే గ్యారెంటీ లేదు. పిల్లలు విదేశాలకి వెళ్లిపోయి .. భర్తను కోల్పోయిన వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? జీవితంలో ఏం జరుగుతుంది? దేనికి భయపడాలి? నన్ను చూడటానికి ఎవరో రావాలని నేను కోరుకోను. నాపై నాకున్న నమ్మకంతోనే బ్రతికేస్తాను. నా వల్ల వీలైనంత సాయం చేస్తాను .. రేపటి సంగతి రేపు ఆలోచన చేద్దాం" అని చెప్పారు. 


More Telugu News