26 ఏళ్లుగా మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా బాధితుడు

  • అల్జీరియాలో వెలుగు చూసిన ఘటన
  • 1998లో కనిపించకుండా పోయిన టీనేజర్
  • ఇన్నాళ్లుగా పొరుగింట్లో బందీగా ఉన్నట్టు బయటపడ్డ ఘటన
  • నిందితుడి సోదరుడి సోషల్ మీడియా పోస్టుతో నేరం బట్టబయలు
  • నిందితుడి మంత్ర ప్రభావంతో బాధితుడు సాయం కోరలేదన్న స్థానిక మీడియా కథనాలు
ఇరవై ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు తేలిన ఘటన అల్జీరియా దేశంలో వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వివరాలను ఆ దేశ న్యాయశాఖ మంత్రి మంగళవారం వివరించారు. 1998లో అల్జీరియా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒమార్ బీ అనే టీనేజర్ కనిపించకుండా పోయాడు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. ఒమార్‌ను ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అతడి కుటుంబం భావించింది.  

కానీ, ఇంతకాలం అతడు తన పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు అనూహ్యంగా బయటపడింది. ఒమార్‌ను బంధించిన వ్యక్తి సోదరుడు ఆస్తి తగాదాల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్టైంది. బాధితుడు ఆ ఇంటి పెరట్లోనే బందీగా ఉన్నట్టు తేలింది. నిందితుడు మరో టౌన్‌లోని మున్సిపాలిటీ కార్యాలయంలో డోర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, నిందితుడి మంత్ర ప్రయోగం కారణంగా తాను సాయం కోసం గొంతెత్తి పిలవలేకపోయానని బాధితుడు చెప్పినట్టు స్థానిక మీడియా ఆశ్చర్యకర కథనం వెలువరించింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా న్యాయశాఖ అభివర్ణించింది. బాధితుడికి శారీరక, మానసిక చికిత్సలు అందిస్తున్నామని, ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది.


More Telugu News