ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన

  • కాఫీ, టీలల్లో టానిన్ అనే రసాయనం ఉంటుందన్న ఐసీఎమ్ఆర్
  • ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుపడుతుందని హెచ్చరిక
  • ఐరన్ లేమితో రక్తహీనత బారిన పడతారని వెల్లడి
టీ, కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, టీ, కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది. ముఖ్యంగా భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు టీ, కాఫీలు అస్సలు తాగొద్దని హెచ్చరించింది. ఈ సమయాల్లో టీ, కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతుందని పేర్కొంది. 

కాఫీ, టీల్లోని కెఫీన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఇదే అలవాటుగా మారి చివరకు కాఫీ, టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అయితే, రోజుకు కెఫీన్ 300 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం, కప్పు (150 ఎమ్ఎల్) కాఫీలో గరిష్ఠంగా 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. కప్పు టీలో 65 గ్రాముల కెఫీన్ ఉంటుంది. 

కాఫీ, టీల్లో టానిన్ అనే కాంపౌండ్ ఉంటుందని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుపడుతుంది. కాబట్టి, భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలోపు ఎట్టిపరిస్థితుల్లో కాఫీ, టీలు తాగొద్దని ఐసీఎమ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ తయారీకి కీలకమైన ఐరన్ లేమితో రక్తహీనత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ తగ్గితే, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ తలనొప్పి, గుండెదడ, చర్మం రంగు పాలిపోయినట్టు ఉండటం తదితర సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. గోళ్లు పెళుసుగా మారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని అంటున్నారు. అయితే, పాలు లేని టీ రక్తప్రసరణకు మంచిదని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. గుండె రక్తనాళాలు, ఉదర సంబంధిత సమస్యలను ఇది దరిచేరనీయదని చెబుతోంది.


More Telugu News