మిగిలింది ఒక్కొక్క మ్యాచే.. ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయాక ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇవే

  • లక్నోపై ఢిల్లీ విజయంతో రేసులో ఆర్సీబీ, సీఎస్కే, సన్‌రైజర్స్
  • చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైపై గెలిస్తే ఆర్సీబీ పోటీలో నిలిచే ఛాన్స్
  • ఢిల్లీ క్యాపిటల్స్ కు తక్కువ ఛాన్స్.. దాదాపు నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2024లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ఒకటి రెండు జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా మెజారిటీ జట్ల చేతిలో ఒక్కొక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ మరో రెండు ప్లే ఆఫ్స్ స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. దీంతో మిగిలివున్న మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్ చేరుకోబోయే జట్లపై ఉత్కంఠ పెరిగింది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ సమీకరణాలు మారిపోతున్నాయి. గత రాత్రి (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇతర జట్లపై ప్రభావం పడింది. లక్నో ఓటమితో సన్‌రైజర్స్, చెన్నై మినహా ఇతర జట్లు 16 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇక 13 మ్యాచ్‌లు ఆడి 19 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా టాప్-2లో నిలిచిన విషయం తెలిసిందే.

దీంతో మరో రెండు స్థానాల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రేసులో కనిపిస్తున్నాయి. లక్నోపై ఢిల్లీ విజయం సాధించడంతో సీఎస్కే, ఆర్సీబీ, సన్‌రైజర్స్ అవకాశాలు మెరుగయ్యాయి. ఒకవేళ ఢిల్లీపై లక్నో గెలిచివుంటే ఆ జట్టుకు 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. లక్నో తన చివరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి. మరోవైపు లక్నోపై ఢిల్లీ గెలవడంతో ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్
ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.528గా ఉంది. చెన్నైకు మిగిలివున్న ఒకే ఒక్క మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఆర్సీబీపై చెన్నై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీ చేతిలో ఓడిపోయినా నెట్ రన్ రేట్ ఆధారంగా అవకాశాలు సజీవంగా ఉంటాయి. లక్నో తన చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ఆ జట్టు ఖాతాలోనూ 14 పాయింట్లు ఉంటాయి. అయితే మెరుగైన రన్ రేట్ ఉన్న చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నాలుగు జట్లతో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు, +0.406 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం. ఒక మ్యాచ్‌ గెలిచినా ఢోకా ఉండదు. ఒకవేళ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. 14 పాయింట్లతో నెట్ విషయంలో ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో జట్లతో పోటీ పడాల్సి రావొచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, +0.387 నెట్ రన్ రేట్‌తో కొనసాగుతోంది. మిగిలిన మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అంతే కాదు మెరుగైన రన్ రేట్ కూడా సాధించాల్సి ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లతో టాప్-4 స్థానం కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. చెన్నై తన చివరి మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఆర్సీబీ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో
ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ రన్ రేట్ మైనస్‌గా ఉంది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి కూడా  దాదాపు ఇంతే. ఆ జట్టు మిగిలివున్న మ్యాచ్‌ గెలిస్తే ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. కానీ నెట్ రన్ రేట్ మైనస్‌గా ఉంది. దీంతో ఈ జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.


More Telugu News