ఏపీలో అందుకే భారీ ఓటింగ్ జరిగింది: మంత్రి బొత్స

  • ఏపీలో పోలింగ్ 80 శాతం దాటుతుందన్న అంచనాలు
  • ఎవరికి వారు తమదే హవా అంటున్న టీడీపీ, వైసీపీ నేతలు
  • టీడీపీ కుట్రలకు తెరలేపిందన్న మంత్రి బొత్స
  • అందుకే సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఓటర్లు పోటెత్తారని వివరణ
ఏపీలో నిన్న భారీ ఎత్తున పోలింగ్ జరగ్గా, ఓటింగ్ 80 శాతం దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో... టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

తాజాగా, పోలింగ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని, జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. కానీ, ఓటమి అర్థంకావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని, వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, మరో రెండు మూడ్రోజుల్లో సీఎం జగన్ పదవీప్రమాణస్వీకారోత్సవం తేదీ, వేదికను కూడా ప్రకటిస్తామని అన్నారు. సీఎం జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని ఓ వేడుకగా జరుపుతామని తెలిపారు. 

రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచిందని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 99 శాతం నెరవేర్చిన సీఎం జగన్ వెంటే ఏపీ ప్రజలు నిలిచారని చెప్పుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని, కూటమి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయాయని బొత్స వ్యాఖ్యానించారు.


More Telugu News