సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కిషన్ రెడ్డి

  • రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ
  • బీజేపీ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం
  • ఎక్కువ మంది ఏపీకి వెళ్లడంతో ఓటింగ్ శాతం తగ్గిందన్న కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని... మాట్లాడితే ప్రధాని మోదీని ఛాలెంజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల నాయకుడికే (రాహుల్ గాంధీ) దిక్కులేదని విమర్శించారు. తమస్థాయిని ఆలోచించి ప్రధానికి సవాల్ విసరాలని సూచించారు. తమ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వారిలో అబద్ధాలు చెప్పి ఓట్లను అడగలేమన్నారు.

తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు, ఓటింగ్ సరళని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారని తెలిపారు. అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.

బీజేపీకి తెలంగాణలో అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాహాటంగా చెప్పారన్నారు. ఈసారి పట్టణప్రాంతవాసులే కాదు గ్రామాల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఈసారి కొత్త శక్తిగా అవతరిస్తుందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఒక్కో హామీని అమలు చేస్తామన్నారు. మోదీని తీసుకువచ్చి సమ్మక్క సారక్క గిరిజన విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు... కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాడుతూ... రెండంచెల వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.


More Telugu News