ఓటరు-చెంపదెబ్బ వ్యవహారంపై వివరణ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని

  • తెనాలిలో పోలింగ్ బూత్ వద్ద ఘటన
  • నేరుగా బూత్ లోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
  • క్యూలైన్ లో రావాలని ఎమ్మెల్యేని కోరిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి
  • సుధాకర్ చెంపచెళ్లుమనిపించిన ఎమ్మెల్యే... తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన సుధాకర్
  • తనను అసభ్యంగా తిట్టాడంటూ ఓ వీడియోలో వెల్లడించిన తెనాలి ఎమ్మెల్యే 
తెనాలిలో ఇవాళ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటరుకు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మధ్య చెంపదెబ్బల వ్యవహారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లేందుకు ఎమ్మెల్యే శివకుమార్ ప్రయత్నించగా, గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం చెప్పారు. దాంతో ఎమ్మెల్యే ఆ ఓటరును చెంపదెబ్బ కొట్టగా, ఆ ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యేని చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చారు. 

"ఇవాళ ఉదయం తెనాలి పట్టణంలోని ఐతా నగర్ పోలింగ్ స్టేషన్లో నేను, నా భార్య ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. అక్కడ క్యూ చాలా పెద్దదిగా ఉంది. అయితే, నా సామాజిక వర్గానికి చెందిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి... "ఇడుగో వచ్చాడయ్యా, మాల మాదిగ వర్గాలకు కొమ్ముకాసే ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి" అంటూ నాపైనా, వైసీపీపైనా ద్వేషంతో మాట్లాడాడు. వైసీపీ... మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పార్టీ అనే అక్కసుతో, శాడిజంతో మాట్లాడాడు. 

అతడిది ఐతా నగరే... ఉండేది బెంగళూరు. నేను కూడా కమ్మవాడ్నే, అతడు కూడా కమ్మవాడే. టీడీపీ, జనసేన వాళ్లు కావాలనే ఎక్కడెక్కడో ఉండేవాళ్లని, అమెరికాలో ఉండేవాళ్లను కూడా తీసుకువచ్చి ఓట్లు వేయించే ప్రయత్నంలో ఇలా శాడిజంతో వ్యవహరిస్తున్నారు. 

ఇవాళ అతడు మద్యం తాగి ఉన్నాడు. నేను, నా భార్య ఓటేయడానికి వెళుతుంటే, ఎమ్మెల్యే అయితే ఏంటంట? క్యూలో రావాలి అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా ఓటేసి వచ్చారు.... ఆయనేమైనా క్యూలో నిల్చుని ఓటేసి వచ్చారా? సహజంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నేరుగా వెళ్లి ఓటేయడం అనేది ఆనవాయతీ. 

కానీ నా భార్య పక్కన ఉండగా అతడు అసభ్యంగా దూషించాడు. మరీ ముఖ్యంగా, చిన్న కులాలను బహిరంగంగా తిట్టాడు. మాల మాదిగలకు అండగా ఉండే పార్టీ... ఈ లం*కొడుకు అసలు కమ్మోడేనా? అని మాట్లాడాడు. అక్కడ ఓటర్లలో చాలామంది కమ్మవాళ్లు, ఎస్సీలు ఉన్నారు. అతడు అన్న మాటలను అక్కడి ఓటర్లందరూ విన్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటూ నేను చేయిచేసుకున్నది నిజమే. 

కానీ అతడు అన్న మాటలను ప్రస్తావించకుండా ఏబీఎన్, టీవీ5, సోషల్ మీడియాల్లో దీన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రజలకు స్పష్టత ఇవ్వడం కోసమే ఈ వివరణ ఇస్తున్నా. ఇలాంటి చర్యల వల్లే ప్రజలందరూ కమ్మ కులాన్ని ద్వేషిస్తున్నారు" అంటూ అన్నాబత్తుని శివకుమార్ వీడియో సందేశం వెలువరించారు.


More Telugu News