కళ్ల ముందు ఘోర పరాజయం కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు: చంద్రబాబు

  • ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు
  • ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు
  • వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ అరాచక, అవినీతి పాలనకు గుడ్ బై చెప్పేందుకు ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పేందుకు... తెల్లవారు జాము నుండే ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో ఎడురు చూస్తున్న ప్రజలే నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో... వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. 

"ఫ్రస్టేషన్‌తో వీరంగం సృష్టిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ, అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారు. కూటమి అభ్యర్థులతో పాటు మీడియాపై, పోలీసులపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ మహిళలపై, పిల్లలపై దాడులు జరిగిన ఘటనలే లేవు. 

కళ్ల ముందు ఘోర పరాజయం కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు వందల సంఖ్యలో కార్యకర్తలను రక్తం వచ్చేలా దాడి చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుపై వైసీపీ మూకలు దాడి చేసి, కార్లను ధ్వంసం చేశారు.

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ నేతలపై, ఓటర్లపై కూడా దాడులకు పాల్పడడం హేయనీయం. గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్యను అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు, మహిళలపైకి కారుతో దూసుకెళ్లడం వైసీపీ నేతల దురహంకారానికి నిదర్శనం. చీరాలలో టీడీపీ అభ్యర్థి యం.యం.కొండయ్యపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌పై పోలింగ్ బూత్ వద్దే దాడికి పాల్పడడం దుర్మార్గం. 

తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకలు వెంటాడి మరీ దాడి చేశారు. కార్లు ధ్వంసం చేశారు. పోరంకి పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువగా వేస్తున్నారని జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ఏకంగా పోలింగ్ ఆపేయాలంటూ హడావుడి చేశాడు. కుర్చీలు విసిరేసి వీరంగం సృష్టించాడు. 

ఇలా ఎక్కడికక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెనాలిలో క్యూ లైన్‌లో రావాలన్నందుకు ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్, అతని కుమారుడు దాడి చేయడం దుర్మార్గం. 

పోలింగ్ కేంద్రాల వద్ద భయానక పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న వైసీపీ నేతల కుట్రలను పోలీసులు ఛేదించాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి" అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News