పాక్ కెప్టెన్ బాబ‌ర్ పేరిట అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి సార‌ధిగా ఘ‌న‌త‌!

  • ప్రస్తుతం ఇర్లాండ్ లో పరుఅతిస్తున్న పాక్  
  • నిన్న‌టి ఐర్లాండ్‌తో మ్యాచులో విజ‌యంతో పాక్ సార‌ధి ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
  • టీ20ల్లో అత్య‌ధిక విజ‌యాలు (45) సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన బాబ‌ర్‌
మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న‌టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పాకిస్థాన్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఐర్లాండ్‌లో ప‌ర్య‌టిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతోంది. ఇక సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు మ్యాచులు ముగిశాయి. ఇందులో మొద‌టి మ్యాచులో ఆతిథ్య ఐర్లాండ్.. పాక్‌ను చిత్తు చేసి గ‌ట్టి షాకిచ్చింది. దీంతో పాక్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది ఇలా ప‌సికూన చేతిలో ఓడిపోవ‌డానికా అంటూ నెటిజ‌న్లు దుమ్మెత్తిపోశారు. 

అయితే, ఆదివారం జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో పాక్ ఘ‌న విజ‌యం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 194 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం 16.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (75), ఫ‌క‌ర్ జ‌మాన్ (78) చెల‌రేగ‌డంతో పాక్ సులువుగా టార్గెట్‌ను ఛేదించ‌డం జ‌రిగింది. ఈ ద్వ‌యం ఏకంగా 140 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం.

ఇక ఈ భారీ విజ‌యంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం పేరిట టీ20ల్లో అరుదైన రికార్డు న‌మోదైంది. ఆ జ‌ట్టుకు 45 టీ20 విజ‌యాలు అందించిన సారిధిగా నిలిచాడు. టీ20ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ జ‌ట్టు కెప్టెన్ ఇన్ని విక్ట‌రీలు న‌మోదు చేయ‌లేదు. దీంతో టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా బాబ‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. అత‌ని త‌ర్వాతి స్ధానాల్లో ఉగాండాకు చెందిన బ్రియాన్ మసాబా (44), ఇంగ్లండ్ మాజీ సార‌ధి ఇయాన్ మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ (42), రోహిత్ శ‌ర్మ‌, మ‌హేంద్ర సింగ్ ధోనీ (చెరో 41 విజ‌యాలు) ఉన్నారు.


More Telugu News