దాడులు, హత్యాయత్నాలతో ఓటమిని ముందే ఒప్పుకున్నారు: చంద్రబాబు

  • ఏపీలో పోలింగ్ తీరుపై చంద్రబాబు స్పందన
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడి
  • సిరా చుక్కలు పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేశారని ఆగ్రహం
  • దాడులు, దౌర్జన్యాలతో ఓటమిని ముందే ఒప్పుకున్నారని వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ కొనసాగుతున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. వైసీపీ అడ్డంకుల్ని అధిగమించి మరీ ప్రజలు ఓటింగులో పాల్గొనడం అభినందనీయం అని పేర్కొన్నారు. మండుటెండలను లెక్కచేయకుండా ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటుండడం హర్షణీయమని వెల్లడించారు. 

ఇక, ఓటమి భయంతో మాచర్ల, రైల్వేకోడూరు, పుంగనూరులో వైసీపీ పేట్రేగిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. "సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేశారు. క్యూలైన్‌లో రమ్మన్నందుకు తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ దాడి దుర్మార్గం. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంఓటమి ఖాయమని నిర్ధారణ కావడంతో అల్లర్లకు తెగబడుతున్నారు. ఐదేళ్ల దౌర్జన్యకాండను ఎన్నికల వేళ కూడా కొనసాగిస్తున్నారు. దాడులు, హత్యాయత్నాలతో ముందస్తుగానే ఓటమిని ఒప్పుకున్నారు. 

పుంగనూరు, మాచర్ల, రైల్వేకోడూరు, మైదుకూరు, ఆముదాలవలస, తాడికొండలో కూటమి ఏజెంట్లపై దాడి దుర్మార్గం. తక్కెల్లపాడు పోలింగ్ స్టేషన్లో ఎస్సీ మహిళలపైకి ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్య కారుతో దూసుకు రావడం హేయం. బాధ్యులపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. 

పోలింగ్ ప్రారంభమైనప్పటికీ జగన్ రెడ్డి పేరుతో ఓటర్లకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. యర్రగొండపాలెంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి వాహనాలపై దాడి చేశారు. 

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు ఓటర్లను బెదిరించారు. ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం అర్ధాంగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తున్న వారిపై ఎన్నికల కమిషన్‌లు చర్యలు తీసుకోవాలి" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News