ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ కు ఎంపికైన డాక్టర్ వైఎస్ సునీత

  • ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా ఫెలోషిప్ కు ఎంపికైన సునీత
  • ఈ ఫెలోషిప్ తన బాధ్యతను మరింత పెంచిందని వ్యాఖ్య
  • సంతోషం వ్యక్తం చేసిన అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్ కు ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఐడీఎస్ఏ అధ్యక్షుడు స్టీవెన్ కె స్మిత్ తెలిపారు. సునీత అంకితభావం, నైపుణ్యం, నాయకత్వం, రోగుల సంరక్షణపై నిబద్ధత తమకు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 

మరోవైపు తనకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ రావడంపై సునీత స్పందిస్తూ... ఈ ఫెలోషిప్ ను తాను ఎంతో గౌరవిస్తున్నానని అన్నారు. మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న అంటు వ్యాధులను ఎదుర్కోవడం, రోగాలకు గురైన పేషెంట్స్ ఆరోగ్య సంరక్షణ విషయంతో తన బాధ్యతను ఈ ఫెలోషిప్ మరింత పెంచిందని చెప్పారు. 

అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి మట్లాడుతూ... సునీతకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ దక్కడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అంటు వ్యాధుల నివారణ, చికిత్సలపై సునీత చేసిన పోరాటం తమ హాస్పిటల్స్ కు ఎంతో గర్వకారణమని చెప్పారు.


More Telugu News