సందేశ్‌ఖాలీ ఘటనలో ఒక్కో మహిళకు రూ. 2 వేలు ఇచ్చి ఆందోళనలు చేయించాం: బీజేపీ నేత

  • వరుసగా వీడియోలు విడుదల చేస్తూ బీజేపీని ఇరుకున పెడుతున్న టీఎంసీ
  • సందేశ్‌ఖాలీ ఘటన వెనక బీజేపీ నేత సువేందు అధికారి కుట్ర ఉందన్న సొంతపార్టీ నేత
  • రేఖాశర్మ తన పదవికి కళంకం తెచ్చారంటూ ఈసీని ఆశ్రయించిన టీఎంసీ
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనకు సంబంధించి మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. సందేశ్‌ఖాలీ లైంగికదాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక టీఎంసీ నేత సత్రప్ షాజహాన్ షేక్‌, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేందుకు 70 మంది మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 2 వేలు చొప్పున చెల్లించినట్టు చెబుతున్నబీజేపీ నేత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

45 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో బీజేపీ సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడు గంగాధర్ కయాల్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఆందోళనకారుల్లో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉన్న 50 బూత్‌లలో పంపిణీ చేసేందుకు రూ. 2.5 లక్షల నగదు కావాలని, ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంతృప్తికరంగా డబ్బులు ఇస్తే ఆందోళనలో ముందు వరుసలో నిల్చుని పోలీసులతో తలపడతారని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. 

గతంలో వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆయనే మాట్లాడుతూ.. సందేశ్‌ఖాలీ అత్యాచార ఆరోపణల్లో నిజం లేదని, ఇదంతా బీజేపీ నేత సువేందు అధికారి కుట్ర అని ఆరోపించి కలకలం రేపారు. ఆయన ఆదేశాలతోనే ఆందోళన నిర్వహించినట్టు చెప్పారు. అయితే, బీజేపీ మాత్రం ఈ వీడియోలు నకిలీవని ఆరోపిస్తోంది. అంతకుముందు బయటకు వచ్చిన వీడియోలో సందేశ్‌ఖాలీ లైంగికదాడి బాధితురాలు మాట్లాడుతూ.. తనపై ఎలాంటి అఘాయిత్యమూ జరగలేదని, కొందరు బీజేపీ నాయకులు తనతో తెల్లకాగితంపై సంతకం చేయించుకుని దానిని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారని తెలిపారు. 

మరోవైపు, బీజేపీ బసిర్హాత్ నియోజకవర్గ అభ్యర్థి, సందేశ్‌ఖాలీ ఆందోళనలో పాల్గొన్న రేఖా పాత్రా మాట్లాడుతూ రాష్ట్రపతిని కలుసుకునేందుకు అత్యాచార బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. కాగా, సందేశ్‌ఖాలీ ఘటనకు సంబంధించి గత వారం రోజులుగా టీఎంసీ వీడియోలు విడుదల చేస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.

సందేశ్‌ఖాలీలోని టీఎంసీ నాయకులపై అత్యాచారం కేసులు పెట్టాలంటూ కొందరు మహిళలకు చెబుతూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మపై టీఎంసీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది.


More Telugu News