దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం.. సీఐఎస్ఎఫ్‌కు బెదిరింపు ఈ మెయిల్

  • లక్నో, భోపాల్, పాట్నా తదితర విమనాాశ్రయాలకు బాంబు బెదిరింపు
  • సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి ఈ మెయిల్
  • తనఖీల అనంతరం బెదిరింపు ఉత్తదేనని తేల్చిన సీఐఎస్ఎఫ్
దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చివేస్తున్నామంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కార్యాలయానికి నిన్న మధ్యాహ్నం 3.05 గంటలకు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ తనిఖీలు ప్రారంభించింది. అయితే, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. 

లక్నోలోని చౌదరీ చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, పాట్నా, జమ్మూ, జైపూర్ తదితర విమానాశ్రయాలకు ఈ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, బాంబు బెదిరింపు ఉత్తదేనని బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ ప్రకటించింది. కాగా, అంతకుముందు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పది ఆసుపత్రులకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. 

దర్యాప్తు అనంతరం ఆ ఈమెయిల్స్ ఉత్తవేనని తేల్చారు. ఈ మెయిల్స్ పంపిన నిందితుల గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 1న ఢిల్లీలోని 100 స్కూల్లు, నోయిడాలోని రెండు, లక్నో ఒక స్కూలుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. రష్యన్ ఈమెయిల్ సర్వీస్ ఉపయోగించి నిందితులు వీటిని పంపినట్టు గుర్తించారు.


More Telugu News