మా పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తే సహించబోం: చంద్రబాబు

  • పుంగనూరు, మాచర్ల పోలింగ్‌ కేంద్రాలలో వైసీపీ అరాచకాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్న టీడీపీ అధినేత
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని వార్నింగ్
  • రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదన్న చంద్రబాబు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు అధికారులదేనని వ్యాఖ్య 
ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు అధికారులదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి వ్యక్తికి ఓటు వేసే స్వేచ్ఛ ఉందని, ఏజెంట్లను పెట్టుకునేందుకు ప్రతి పార్టీకి హక్కు ఉందని, ఏజెంట్లను అనుమతించాలని చంద్రబాబు అన్నారు. ఇందుకు అధికారులదే బాధ్యత అని అన్నారు. పుంగనూరు, మాచర్లలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చిందని, వీటిపై ఫిర్యాదు చేశామని, అధికారులతో మాట్లాడుతున్నామని అన్నారు. మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కాదని, ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా అపహాస్యం చేయాలని ప్రయత్నిస్తే తమ పార్టీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం ఓటింగ్ ప్రక్రియ కొనసాగాలని, ప్రజాభీష్టం నెరవేరాలని, దానికి తాము కట్టుబడి ఉంటామని చంద్రబాబు అన్నారు. ప్రజాభీష్టాన్ని వమ్ము చేసేవిధంగా రౌడీయిజంతో, గుండాయిజంతో తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు.


More Telugu News