ఓటు వేసిన చంద్ర‌బాబు దంప‌తులు

  • ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్న చంద్ర‌బాబు
  • ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేసిన నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి 
  • ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని టీడీపీ అధినేత‌ పిలుపు
  • గుండాయిజం, రౌడీయిజంతో రెచ్చిపోతే స‌హించేదిలేదన్న చంద్ర‌బాబు
మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయ‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి కూడా ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

ఈ ఎన్నికలు చాలా ప్ర‌త్యేక‌మైన‌విగా ఆయ‌న పేర్కొన్నారు. ఇవాళ ఓటు వేస్తే రేపు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంద‌న్నారు. భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నిక‌లే అని తెలిపారు. ఓటు వేసేందుకు ఉద‌యం నుంచే జ‌నాలు బారులు తీర‌డం బాగుంద‌ని, వారు చూపిస్తున్న చొర‌వ మ‌రువ‌లేనిద‌ని చెప్పారు.

ఇంకా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. "ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావిత‌రాల భ‌విష్య‌త్తుకు పునాదులు వేస్తుంది. విదేశాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు స్వ‌స్థ‌లానికి రావ‌డం బాగుంది. అన్న‌మ‌య్య‌, ప‌ల్నాడు జిల్లాల్లో దాడుల‌ను ఖండిస్తున్నా. ఈ దాడుల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. గుండాయిజం, రౌడీయిజంతో రెచ్చిపోతే స‌హించేదిలేదు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు, ఈసీ బాధ్య‌త తీసుకోవాలి. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తే మా కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోరు" అని చంద్ర‌బాబు హెచ్చరించారు. 


More Telugu News