ఇంతకు మించి చెప్పేందుకు ఏమీ లేదు.. మ్యాచ్ నిషేధం‌పై రిషబ్ పంత్ కామెంట్

  • మ్యాచ్ నిషేధంపై పరోక్షంగా స్పందించిన పంత్
  • మనిషికి తన ఆలోచనలపై మాత్రమే నియంత్రణ ఉంటుందన్న పంత్
  • ఇంతకు మించి తాను చెప్పేదేమీ లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్
రాజస్థాన్‌ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మందకొడి బౌలింగ్ కారణంగా జట్టు సారథిపై ఒక మ్యాచ్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధంతో పాటు రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. ప్లే ఆఫ్స్‌ రేసులో అత్యంత కీలకమైన మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో పంత్‌పై నిషేధం జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈ నేపథ్యంలో ఆదివారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ డీసీకి సారథ్యం వహించాడు. 

అయితే, మ్యాచ్‌కు ముందు తనపై విధించిన నిషేధంపై రిషబ్ పంత్ పరోక్షంగా స్పందించాడు. ‘‘ఈ ప్రపంచంలో మనకు దేనిపైన అయినా నియంత్రణ ఉందంటే అది మన ఆలోచనలపైనే. ఇంతకు మించి నేను చెప్పేందుకు ఏమీ లేదు’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 

కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో మందకొడి బౌలింగ్ కారణంగా నిషేధానికి గురైన తొలి కెప్టెన్‌గా పంత్ నిలిచాడు. మూడో సారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీం మందకొడిగా బౌలింగ్ చేయడంతో జట్టు కెప్టెన్‌పై వేటు పడింది. మొదటి రెండు మ్యాచ్‌లు స్లో రన్ రేట్ కారణంగా పంత్‌పై వరుసగా రూ.12 లక్షలు, రూ.24 లక్షల జరిమానా విధించారు. మూడోసారి తప్పు పునరావృతం కావడంతో నిషేధానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూంలో నిషేధం గురించి తెలుసుకున్న రిషబ్ పంత్ ఆగ్రహానికి గురైనట్టు అక్షర్ పటేల్ తెలిపాడు. 

కాగా, నిషేధంపై డీసీ.. అప్పీల్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. అప్పీల్ సందర్భంగా జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ గట్టి వాదనలు వినిపించినా బీసీసీఐ అంబుడ్స్‌మన్ నిషేధం కొనసాగించేందుకు మొగ్గు చూపింది.


More Telugu News