ఏపీలో పోటెత్తిన ఓటర్లు.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

  • రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బార్లు
  • అందరూ కదిలి రండి.. తప్పకుండా ఓటు వేయండంటూ సీఎం జగన్ పిలుపు
  • ఎక్స్ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. ఉదయం 6.30 గంటలకే ఓటర్లు క్యూలైన్లలో నిలబడగా ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వేర్వేరు పనులు ఉన్నవాళ్లు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశం ఒకటైతే.. ఎండల నేపథ్యం కూడా ఇందుకు మరో కారణంగా ఉంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే ఈసారి సుదూర ప్రాంతాల నుంచి సైతం ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరగవచ్చుననే అంచనాలు నెలకొన్నాయి.

ఓటర్లకు సీఎం జగన్ సందేశం
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!’’ అంటూ తన సందేశం ఇచ్చారు.


More Telugu News