మీ ఓటును మరొకరు వేస్తే ఏం చేయాలంటే...!
- తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు
- ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్
- తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
- టెండర్ ఓటు/చాలెంజ్ ఓటు పొందడంపై వివరాలు ఇవిగో!
పోలింగ్ వేళ దొంగ ఓట్లు వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం చూస్తుంటాం. అయితే, మన ఓటును మరొకరు వేస్తే... తిరిగి మన ఓటును ఎలా పాందాలో చాలా మందికి తెలియదు. దీనికో పద్ధతి ఉంది. ఒకరి ఓటును మరొకరు వేస్తే ఆ ఓటును ఎలా సాధించుకోవచ్చో చెప్పేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్షన్ 49(పి)ని తీసుకువచ్చింది. ఈ సెక్షన్ ను 1961లోనే తీసుకువచ్చారు. దీన్నే టెండర్ ఓటు లేదా చాలెంజ్ ఓటు అంటారు.
దీని విధివిధానాలు ఇవే...
దీని విధివిధానాలు ఇవే...
- పోలింగ్ సమయంలో మన ఓటును వేరే వారు వేశారని గుర్తిస్తే... ముందుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కలవాలి.
- తన ఓటును మరొకరు వేశారన్న విషయాన్ని ఆ అధికారికి వివరించి, అసలు ఓటరును తానే అని నిరూపించుకోవాలి. అందుకోసం ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఐడీ ప్రూఫ్ లు సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్ పోర్టు చూపించాల్సి ఉంటుంది.
- అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఫారం 17(బి) ఇస్తారు. అందులో మీ పేరు, ఇతర వివరాలు నింపి, సంతకం చేసి ఇవ్వాలి.
- ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారి టెండర్ బ్యాలెట్ పేపర్ ను సదరు ఓటరుకు ఇస్తాడు. అందులో ఉన్న అభ్యర్థుల జాబితా పరిశీలించి, నచ్చిన అభ్యర్థికి ఓటేసి, తిరిగి ఆ బ్యాలెట్ పేపర్ ను ప్రిసైడింగ్ అధికారికి ఇచ్చేయాలి.
- ఆ టెండర్ బ్యాలెట్ పేపర్ ను ఓటుగా పరిగణించి, దాన్ని భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపుతారు.
- అయితే, 49(పి) ద్వారా ఓటును తిరిగి పొందేవారు ఈవీఎం ద్వారా ఓటు వేయడం కుదరదు. వారికి ప్రత్యేకమైన బ్యాలెట్ పేపరు ఇస్తారు.