నంద్యాల ఎస్పీపై చర్యలు తీసుకోండి... అల్లు అర్జున్ పర్యటన వ్యవహారంపై ఈసీ సీరియస్

  • నిన్న నంద్యాల వచ్చిన అల్లు అర్జున్
  • వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతు
  • అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ పర్యటనకు పోలీసు బందోబస్తు!
  • ఈసీకి ఫిర్యాదులు... చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఈసీ ఆదేశాలు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నంద్యాలలో పర్యటించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిలపై ఇప్పటికే కేసు నమోదైంది. 

ఇప్పుడీ వ్యవహారం నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి మెడకు చుట్టుకుంది! జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో విఫలమయ్యారని, ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ రఘువీర్ రెడ్డితో పాటు ఎస్డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిలపై డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ జరిపించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. 

అల్లు అర్జున్, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి గత 15 ఏళ్లుగా స్నేహితులు. స్నేహితుడికి ఎన్నికల్లో మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా శనివారం నాడు నంద్యాల వచ్చారు. నంద్యాల శివారు ప్రాంతంలో బన్నీకి ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు... భారీ సంఖ్యలో కార్లు, బైక్ లతో ర్యాలీ చేపట్టాయి. 

అయితే, అల్లు అర్జున్ పర్యటనకు ముందస్తు అనుమతులేవీ లేకపోయినా పోలీసులు భారీ బందోబస్తు అందించారంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే, ఈసీ తీవ్రస్థాయిలో స్పందించింది.


More Telugu News