పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లాక ఓటు ఎలా వేయాలంటే..

  • ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు గమనించాల్సిన అంశాలెన్నో
  • ఏపీలో 25 లోక్ సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు రేపు పోలింగ్
  • తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి కూడా..
‌‌సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిద్ధమయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియపై ఓటర్ల అవగాహన కోసం ఈ కింది సూచనలు.

– పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లగానే మీ దగ్గరున్న ఓటర్ ఐడీ కార్డు, పోలింగ్‌ స్లిప్ ను చూపించాలి.
– మొదటి సీట్లో కూర్చొనే పోలింగ్ అధికారి మీ ఓటర్ ఐడీ కార్డు సీరియల్‌ నెంబర్‌, పార్ట్ నెంబర్ ను తన వద్ద ఉండే జాబితాలోని వివరాలతో సరిపోలాయో లేదో చూసుకుంటారు.
– వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయ్యాక మరో పోలింగ్‌ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.
ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. పోలింగ్ వివరాల స్లిప్ ను ఇస్తారు.
– మూడో ఎన్నికల అధికారి ఆ స్లిప్ ను పరిశీలించి మీరు ఓటు వేయడానికి వీలుగా తన వద్ద ఉన్న ఓటింగ్ కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కి మీ ఓటు నమోదయ్యేందుకు దాన్ని సిద్ధం చేస్తారు. అలాగే ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌ లోకి వెళ్లడానికి అనుమతిస్తారు.
– ఓటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్ మెంట్ లో ఓటేసే ఈవీఎం మెషీన్‌, దాని పక్కనే వీవీ ప్యాట్ యంత్రం ఉంటాయి. మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే వీవీ ప్యాట్.
– ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒకవైపు, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు... వాటి పక్కనే నీలి రంగు బటన్‌ ఉంటాయి.
– మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కగానే రెడ్ లైట్ వెలుగుతుంది. బీప్ అనే శబ్దం వస్తుంది.
– ఆ వెంటనే వీవీ ప్యాట్ యంత్రంపై పచ్చటి లైట్‌ వెలుగుతుంది.
– వీవీ ప్యాట్ పై ఉండే స్క్రీన్‌పై మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్‌ బాక్స్‌లోకి పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ బీప్ శబ్దం వస్తుంది. ఇలా జరిగితేనే మీ ఓటు నమోదైనట్లు అర్థం.
– ఈ ప్రక్రియలో ఏది జరగలేదని మీకు అనుమానం వచ్చినా పోలింగ్ కేంద్రంలో ఉండే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి.
– ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్‌ బూత్‌లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్‌లు ఉంటాయి. ఓటర్లు రెండుసార్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ఓటర్ ఐడీలో తప్పులు దొర్లాయా? అయినా కంగారు అక్కర్లేదు
కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్‌ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. కానీ అంతమాత్రాన ఓటర్లు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరంలేదు. ఎపిక్‌ వివరాల్లో స్వల్ప తేడాలున్నా ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే అధికారులు ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది.

ఈసీ గుర్తించే 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాలు ఇవే..
1. ఆధార్‌కార్డు 
2. ఉపాధి హామీ కార్డు
3. జాబ్‌ కార్డు 
4. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌ 
5. కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు 
6. డ్రైవింగ్‌ లైసెన్స్‌
7. పాన్‌కార్డు 
8. రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రార్‌(ఎన్పిఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు  
9. భారతీయ పాస్‌పోర్టు 
10. ఫొటోతో ఉన్న పెన్షన్‌ పత్రాలు
11. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్‌ లిమిటెడ్‌  కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు 
12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)


More Telugu News