ఎల్లుండి పోలింగ్... ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు

  • మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • నేటి సాయంత్రంతో ముగిసిన ప్రచార పర్వం
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిబంధనల నేపథ్యంలో, నేటి సాయంత్రంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని నినదించారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. 

2014లో రాష్ట్రం విడిపోయిందని, అనేక కష్టనష్టాలతో నాడు టీడీపీ ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టిందని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి దిశగా నడిపించామని పేర్కొన్నారు. 2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని స్పష్టం చేశారు. 

కానీ మోసపూరిత హామీలతో జగన్ అధికారంలోకి వచ్చి, అధికారం చేపట్టినప్పటి నుంచే విధ్వంసక, అరాచక పాలనకు తెరదీశారని విమర్శించారు. వ్యవస్థలను చెరబట్టి, ప్రశ్నించే ప్రజలను, విపక్షాలను అణచివేశారని ఆరోపించారు. 

ఇప్పుడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే అవకాశం వచ్చిందని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని అరాచకాలకు ముగింపు పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అజెండాతో ముందుకువచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు నిండుమనసుతో ఓటేసి గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.


More Telugu News