పిఠాపురంలో గెలిస్తే... వంగా గీతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్

  • కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభ
  • హాజరైన సీఎం జగన్
  • దత్తపుత్రుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం
  • కార్లను మార్చినట్టు భార్యలను మార్చే వ్యక్తి అంటూ విమర్శలు
  • దత్తపుత్రుడు గెలిచినా పిఠాపురంలో ఉండడని వెల్లడి
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, దత్తపుత్రుడు అంటూ ధ్వజమెత్తారు.

మేనిఫెస్టోలో ఇచ్చింది అడ్డగోలు హామీలు అని తెలిసి కూడా, రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్కచెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అంటూ చంద్రబాబుకు దత్తపుత్రుడు కత్తి అందిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? అని ప్రశ్నించారు. 

"ఈ దత్తపుత్రుడ్ని నా అక్కచెల్లెమ్మలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచించాలి. ఒకసారి జరిగితే పొరపాటు... రెండోసారి జరిగితే గ్రహపాటు... అదే మూడోసారి, నాలుగోసారి జరిగితే అలవాటు కాదా? 

ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్కచెల్లెమ్మ అయినా పని నిమిత్తం దత్తపుత్రుడ్ని కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఎవరైనా వెళ్లి ఏ మహిళ అయినా పని అడగ్గలరా? 

ఈ దత్తపుత్రుడి గురించి ఇంకో విషయం కూడా చెబుతున్నా. ఈ దత్తపుత్రుడికి ఓటేసి గెలిపిస్తే, అతడు పిఠాపురంలో ఉంటాడా? ఈ దత్తపుత్రుడికి ఈ మధ్యనే జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది... ఇప్పుడు పిఠాపురం!

ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందా? మరో పక్క నా తల్లి (వంగా గీత) ఇక్కడుంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్నా... మా తల్లిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి... ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తా... ఇదే నా మాట! 

చివరగా మరొక్క మాట... చంద్రబాబు ప్రలోభాలకు మీరెవరూ మోసపోవద్దు. ఐదేళ్లు మీ బిడ్డ పాలన చూశారు. ఏ నెలలో అమ్మ ఒడి ఇస్తాను, ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో చేయూత ఇస్తాను అని క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేశాను. 

చంద్రబాబు మాటలు నమ్మి వచ్చే ఐదేళ్లలో జరిగే మంచిని పోగొట్టుకోవద్దు. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మా అక్కచెల్లెమ్మలకు అందాలన్నా, పేదల భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే... ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయాలి.

ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు... ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు.... అందరూ సిద్ధమేనా?" అంటూ సీఎం జగన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.


More Telugu News