రాష్ట్రానికి వచ్చిన మోదీ, అమిత్ షా ఏమైనా ప్రకటిస్తారని భావించా.. ఏమీ లేదు!: రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో పటాన్‌చెరు వరకు మెట్రో, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రకటిస్తారనుకున్నానన్న సీఎం
  • అంబేడ్కర్ ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
  • చట్టసభల్లో మన గళం వినిపించాలంటే కాంగ్రెస్ గెలవాలన్న సీఎం
ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఏమైనా ఇస్తారని భావించానని... కానీ ఏమీ ప్రకటించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పటాన్‌చెరులో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో పటాన్‌చెరు వరకు మెట్రో, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ ఇస్తారని తాను భావించానని కానీ అవేమీ ప్రకటించలేదన్నారు.

అంబేడ్కర్ ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. చట్టసభల్లో మన గళం వినిపించాలంటే కాంగ్రెస్ గెలవాలని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్‌లో అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారన్నారు. కేసీఆర్, హరీశ్ రావులకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఆయన మెదక్ లోక్ సభ టిక్కెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ మన మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు సూచించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తొలగిస్తుందని హెచ్చరించారు.


More Telugu News