కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల హవా: మాజీ సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందన్న కేసీఆర్
- హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని మండిపాటు
- నాలుగు నెలల కాలంలోనే రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత వచ్చిందని వెల్లడి
- మోదీ దేశాన్ని ప్రైవేటు పరం చేశారని ఆరోపించిన కేసీఆర్
- ప్రాంతీయ పార్టీల ద్వారా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఇండియా లేదా ఎన్డీఏ కూటమి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎన్డీఏ లేదా ఇండియా కూటమి వాటికి మద్దతునిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు తరఫున కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ ఎన్డీటీవీ కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసింది.
ఎన్నికల ఫలితాల తర్వాత ఈసారి దేశంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి గానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిగానీ ప్రాంతీయ పార్టీల ద్వారా కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారతాయన్నారు. ఆరు గ్యారంటీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందని తెలిపారు.
కేవలం నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయడం వల్ల ఆటోడ్రైవర్లకు ఉపాధిలేక రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు. ఎంతోమంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని, ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
అవకాశ వాద నేతలు మాత్రమే బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ అటువంటి పొద్దు తిరుగుడు పువ్వులాంటి నేతలు ఉన్నారని వివరించారు. బీజేపీ ఎంత ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి తెలంగాణలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు రావన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రజాకర్షణను కోల్పోయారని కేసీఆర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనమైపోయిందని, రైతులతోపాటు ఇతర వర్గాలు కూడా మోదీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో 750 మంది రైతుల మృతికి మోదీ కారణమయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ విధాన పర నిర్ణయాలను వ్యతిరేకించిన తొలి ముఖ్యమంత్రిని తానేనని, అందుకే తమను అణచివేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని కేసీఆర్ ఆరోపించారు. సంబంధంలేని కేసులో కవితను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకముందని, అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందన్నారు. త్వరలోనే తన కుమార్తె కవితకు కూడా బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.